Sunday, January 19, 2025
HomeTrending Newsమంచి చేశాం కాబట్టే 40 శాతం ఓట్లు సాధించాం: వైసీపీ నేతలు

మంచి చేశాం కాబట్టే 40 శాతం ఓట్లు సాధించాం: వైసీపీ నేతలు

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని, ఐదేళ్లుగా ప్రజలకు ఎంతో మంచి చేశామని…. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేశామని  ఇది తప్పకుండా జగన్‌ చేసిన విశేష కృషి  ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంపిలు, ఎమ్మెల్యేలు  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా నేతలు ఎన్నికల్లో దారుణ ఓటమిపై తమ విచారం వ్యక్తం చేస్తూ.. తమ ప్రభుత్వం వివిధ రంగాలకు చేసిన మంచిని నెమరువేసుకున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈవీఎం మేనేజ్‌మెంట్‌ పై కూడా కొంతమంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ… ఈసీ, కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయని,  ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 40 శాతం ఓటింగ్‌ రావడం వెనుక ఐదేళ్ల పాటు చేసిన కార్యక్రమాలే నిదర్శనమని నేతలు పేర్కొన్నారు.

గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని, ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామని నేతలు పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుందని, కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుందని, ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారని నేతలు అన్నారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల మనసులో చోటుఉందని, పునర్‌ వైభవానికి ఇదే గట్టిపునాది అని అన్నారు.

కాగా, వైసిపి కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని ఈ సమావేశంలో వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలోని తన నివాసం పక్కన ఉన్న క్యాంప్ ఆఫీస్ కు మార్చాలని, ఈ నెల పది నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని  వైసీపీ ముఖ్య నేతలకు జగన్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్