వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగిందని, పలు ఫ్లై ఓవర్ల తో పాటు కృష్ణా నది రీటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ లు వెల్లడించారు. నగరంలో నారా లోకేష్ పాదయాత్ర ఓ ప్రహసనంలా మారిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
తన నియోజకవర్గంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే లోకేష్ యాత్ర జరిగిందని, అది పాదయాత్ర కాదని, ఈవెనింగ్ వాక్ లా మారిందని వెల్లంపల్లి అన్నారు. విజయవాడకు ఈపని తాము చేశామని చెప్పే దమ్ము, ధైర్యం టిడిపికి ఉందా అని నిలదీశారు. ఆ పార్టీ నేతలే యాత్రను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నానిలు పాల్గొనలేదని గుర్తు చేశారు. ఇక్కడ జనాలు రావడం లేదని, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నుంచి పెయిడ్ వర్కర్స్ ను తీసుకు వచ్చి నడిపిస్తున్నారని అన్నారు.
గత ఐదేళ టిడిపి హయంలో విజయవాడ ప్రజలను మోసం చేశారని, జగన్ నాయకత్వంలో నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని దేవినేని అవినాష్ అన్నారు. టిడిపికి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండగా చేయలేని వారు ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
ముస్లింలు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇలా అన్ని వర్గాలవారూ తమను వచ్చి కలిశారని లోకేష్ చెప్పుకుంటున్నారని, నాలుగేళ్ల పాలనలో తాము అన్ని వర్గాల వారినీ ఆదుకున్నామని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆసరా ద్వారా 90 వేల మందికి పెన్షన్లు ఇచ్చామని, చేయూత ద్వారా 30 వేల మందికి, అమ్మ ఒడి ద్వారా 70 వేల మందికి, జగనన్న కాలనీల ద్వారా 90 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి మేలు చేశామని వివరించారు.