నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చని అంత మాత్రాన ఓటర్లు ఆకర్షితులై.. ప్రజలు మద్దతు పలుకుతారని అనుకోవటం పెద్ద పొరపాటని అన్నారు. నాయకులు చేరినంత మాత్రాన ప్రజలు టీడీపీ వెంట నడిచే పరిస్థితి ఉందా అన్నది చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి నిన్న వీపీఆర్ చేరిక సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
“అధికారం ఇచ్చిన ప్రజలకు ఐదేళ్లు సేవ చేశాం. మరోసారి ప్రజల సేవ చేసేందుకు మేం సిద్ధం అని సీఎం జగన్ సిద్ధమన్నారు. దానికి చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. అంటే.. గతంలో హామీలు ఇచ్చి జనాలను ఎలా మోసం చేశానో అదే పంథాలో కొనసాగటానికి సిద్ధమని చెప్పదల్చుకున్నారా? మరలా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని మోసం చేయటానికి సంసిద్ధమని చంద్రబాబు చెబుతారా? తద్వారా ప్రజలను తీరని ద్రోహం చేయటానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారా? జగన్ మోహన్ రెడ్డి నేను చెప్పాను.. ప్రజలకు ఇచ్చాను.. మరలా అవకాశం ఇస్తే.. మీ కుటుంబానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటానికి సిద్ధమని జగన్ అంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను, పొరుగు రాష్ట్రాల మేనిఫెస్టోలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు తప్ప.. సొంతంగా ఇది చేస్తానని చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు మోసగాడు అని బ్రాండ్ పడిపోయింది. ఇచ్చిన మాట మీద బాబు నిలబడడు. జనాలను మోసం చేస్తాడని ఓటేస్తే మనం నష్టపోతామనే భావం ప్రజల్లో ఉంది” అని మంత్రి వివరించారు.
నెల్లూరులో వైసీపీ బలంగా ఉందని, 10కి 10 స్థానాలు తమ పార్టీయే గెలుస్తుందని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత మందిని తాను చేర్చుకుంటున్నానని, సోమిరెడ్డి మరికొంత మందిని చేర్చుకుంటున్నారని, చేరికల ఆధారంగా గెలుపు ఓటములు ఆధారపడవని అభిప్రాయపడ్డారు.