స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో బడుగు, బలహీనవర్గాలకు ఏం మేలు జరిగిందో, జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో ఎంత మంచి జరిగిందో ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి అన్నారు. “నేను ఎస్సీని, దళితుడిని…నిరక్షరాస్యుల, పేదబిడ్డను… జగనన్న చలవతో డిప్యూటీ సీఎం అయ్యాను” అని భావోద్వేగం వ్యక్తం చేశారు. వైయస్సార్ కడప జిల్లా మైదుకూరులో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌భాషా, నారాయణస్వామి, మంత్రి విడదల రజని, ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లతో పాటు వివిధ కార్పొరేషన్ల నాయకులు, జెడ్పీ ఛైర్మన్, జెడ్పీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తన హయాంలో ఈ వర్గ్లాలను ఎంత చులకనగా చూశారో, ఎన్ని అవమానాలు చేశారో చూశామని, మరోసారి ఆయన్ని నమ్మితే నిండా మునగడమేనని హెచ్చరించారు. బడుగు,బలహీన వర్గాలను బాబు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని, కానీ వారి సామాజిక, ఆర్థిక ఉన్నతి పెంచిన అసలు సిసలైన ప్రజానాయకుడు జగన్ అని పేర్కొన్నారు.
మంత్రి విడదల రజని మాట్లాడిన ముఖ్యాంశాలు:
* జగనన్న కటౌట్ పెడితేనే ఇంత మంది తరలివచ్చారంటే…ఆయనపై మీకెంత అభిమానం ఉందో అర్థమవుతోంది.
* కడపలోని ప్రతి గడప గర్వపడేలా నాడు వైఎస్సార్, నేడు జగనన్న పాలన చేస్తున్నారు.
* రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగనన్న.
* నాడు–నేడు పేరిట వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
* 96 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తోంది.
* జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న తోడు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకోసం తీసుకొచ్చారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశలో నడిపిస్తూ..ముందుకు తీసుకెళుతున్నారు.
ఎలమంచిలిలో
టీడీపీ గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, జగన్ మాత్రం సీఎం అయిన వెంటనే రైతులకు, మహిళలకు, వృద్ధులకు, యువతకు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజాప్రతినిధులను ఉప ముఖ్యమంత్రులను చేసిన జగన్ కు ఆయా వర్గాలన్నీ రుణపడి ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అశేష జనసందోహం హర్షధ్వానాల మధ్య అనకాపల్లి జిల్లా యలమంచిలిలో సామాజిక సాధికార బస్సుయాత్ర ఘనంగా సాగింది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో పాటుగా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబు రాజు తదితరులు కలిసి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగసభ జరిగింది.
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలతో విసిగిపోయి నిరాశ, నిస్పృహలతో నిట్టూరుస్తున్న వర్గాలకు జగన్ తన జనరంజక పాలనతో వెలుగులు నింపారన్నారు. గతంలో అధికారమిచ్చినపుడు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారం కావాలంటున్నాడని, ఇప్పుడు మరోసారి పాలన చేసే అవకాశం కల్పిస్తే వైఎస్ జగన్ చేయని ఏ పని చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే తప్పుడు పనులను జగన్ ఏమి చేశాడని…అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ నీడ లేని కుటుంబాలకు ఇళ్లు, వృద్ధులకు పెన్షన్, మహిళలకు, రైతులకు రుణాల మాఫీ చేయడం తప్పా అని చంద్రబాబుని ప్రశ్నించారు. ధనిక, పేద మధ్య ఉన్న అంతరాలను తొలగించేది విద్య మాత్రమేనని సీఎం జగన్ గుర్తించారని, అందుకే నాడు – నేడు ద్వారా నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించారన్నారు. చంద్రబాబు పదే పదే అబివృద్ధి చేశానని చెబుతుంటాడని, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కటంటే ఒక్కటి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు సవాల్ చేశారు.
నరసరావుపేటలో
రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఏపీలో ముందెన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొనేలా పాలన జరుగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. మహనీయులు కన్న కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయని, రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా ప్రజలకు అందించారని, అందులో 78 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని వెల్లడించారు. 2.70 లక్షల ఉద్యోగాలిస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయన్నారు.
సామాజిక సాధికార యాత్రతో నరసరావుపేట దద్దరిల్లింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అశేష జనవాహిని వెంటరాగా నేతలంతా బస్సు యాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బైక్ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇసకేస్తే రాలనంత జనంతో, జగన్నామ స్మరణతో నరసరావుపేట పులకించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు.