నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డది ఎవరన్నదానిపై ఓ అంచనాకు వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ అంతర్గతంగా దర్యాప్తు జరిపి ఆధారాలతో సహా నిరూపితం కావడం వల్లే… పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం పార్టీ అధ్యక్షుడు, సిఎం జగన్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని సజ్జల చెప్పారు. గడప గడపకూ మన ప్రభుత్వం, వివిధ సర్వేల్లో తమకు వచ్చిన నివేదికల ద్వారా వచ్చే ఎన్నికల్లో వారు అభ్యర్ధులుగా ఉండబోరని జగన్ వారితో స్పష్టంగా చెప్పారని… అందుకే వారు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. వీరితో పాటు మరికొందరికి కూడా జగన్ ఈ విధంగా చెప్పినా వారు పార్టీ లైన్ దాటలేదన్నారు. ఎన్నికలకు ముందు హఠాత్తుగా అభ్యర్ధులను మార్చడం సిఎం జగన్ చేయరని, అందుకే వారికి ముందుగానే చెప్పారని సజ్జల వివరించారు.
ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ దాదాపు 20కోట్ల వరకూ డబ్బులిచ్చి ప్రలోభ పెట్టి కొనుక్కున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీనిపై ఓ అవగాహనకు వచ్చిన తరువాతే సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Also Read : మా ఎమ్మెల్యేలను కొన్నారు: సజ్జల