వైఎస్సార్సీపీ త్వరలో కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి బానినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల అడ్డుపడకపోయిఉంటే ఈ పాటికే విలీన ప్రక్రియ పూర్తయి ఉండేదని… అయినా సరే ఇది పూర్తిగా ఆగలేదని… మహా అయితే వచ్చే ఏడాది వరకూ ఆగుతుందని ఆ తర్వాత ఇది జరిగి తీరుతుందని జోస్యం చెప్పారు.
బాలినేని వైసీపీ వీడుతున్నారని, త్వరలో ఆయన జనసేనలో చేరుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు లేపుతున్నాయి. వైఎస్ కుటుంబానికి సమీప బంధువు కూడా అయిన బాలినేని పక్కా సమాచంరంతోనే ఈ వ్యాఖ్యలు చేసిఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. 2022 లో అప్పటి క్యాబినెట్ విస్తరణ సమయలో తనకు ఉద్వాసన పలికినప్పటినుంచీ బానిలేని… జగన్ పై అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఒంగోలు ఎంపి టికెట్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినా జగన్ అంగీకరించలేదు, ఆ సమయంలో బాలినేని కూడా పార్టీ మారతారని వార్తలు వచ్చినా జగన్ పిలిచి మాట్లాడి సముదాయించారు. అయితే పార్టీ ఓటమి తరువాత కూడా తనకు అవమానాలు ఆగలేదని, ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీ మార్పు విషయమై గతవారమే సన్నిహితులకు బాలినేని కచ్చితమైన సమాచారం ఇచ్చారు. జనసేనలో ఆయన చేరిక దాదాపు ఖరారైంది. ఈ సమయంలోనే బాలినేని వైసీపీ-కాంగ్రెస్ విలీన ప్రక్రియపై మాట్లాడడం గమనార్హం.
వైసీపీ ఓడిపోతుందని తమకు సంవత్సరం ముందే తెలుసని, జగన్ చేసిన సర్వేలో కూడా 15 సీట్లకు మించి రావని నివేదిక వచ్చిందని, ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఇదే విషయం చెప్తే బయట చెప్పద్దని జగన్ కోప్పడ్డారని బాలినేని వ్యాఖ్యానించారు. నాయకులు కార్యకర్తల్లో ఆత్మస్థయిర్యం నింపడానికే వై నాట్ 175, నువ్వే మా నమ్మకం.. నీతోనే భవిష్యత్ అనే కార్యక్రమాలు చేపట్టారమన్నారు. జగన్ మూర్ఖత్వమే జగన్ పతనానికి కారణం, ఇక ఈ జన్మలో వైసిపి గెలిచే అవకాశం లేదని ఆయన తేల్చి చెబుతున్నారు.