Friday, November 22, 2024

జీ తెర మరుగు

Sony take over Zee TV Network

స్వదేశీ- విదేశీ భావనకు ఇక ఎంతమాత్రం విలువ ఉండకపోవచ్చు. 1990 నుండి దేశంలో ఆర్థిక సరళీకరణలు, ప్రపంచీకరణ విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడాలు ఒక ఉద్యమంగా జరుగుతోంది. మిలటరీ ఆయుధాల తయారీలోనే విదేశీ పెట్టుబడులు చేయి చేసుకుంటున్నప్పుడు ఫలానా రంగంలో విదేశీ ఉండవచ్చు…ఫలానా రంగంలో ఉండకూడదు అని గుండెలు బాదుకోవడం దండగ. మనం రోజూ వాడుతున్న వేనవేల వస్తువులు ఎన్నో స్వదేశీ తయారీ కాకపోవచ్చు. గూగుల్ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు వాడే వస్తువు కంపెనీ పేరు టైప్ చేసి ఏ విదేశీ పెట్టుబడిదారుడిదో చిటికెలో కనుక్కోవచ్చు.

మీడియా రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. నెమ్మదిగా భారతీయ మీడియా విదేశీ కంపెనీల హస్తగతమవుతోంది. తాజాగా జీ నెట్ వర్క్ ను జపాన్ కు చెందిన సోనీ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. దాదాపు 53 శాతం భాగస్వామ్యానికి పదకొండు వేల కోట్ల మూలధనం నిల్వలు ఉండేలా పెట్టుబడి పెట్టి జీ ని సోని ఆక్రమించింది. అంటే జీ నెట్ వర్క్ విలువ దాదాపు ఇరవై వేల కోట్ల పైమాటే. దేశంలోనే అతి పెద్ద మీడియా కంపెనీగా అవతరించబోతోంది.అంతకు ముందే స్టార్ నెట్ వర్క్ దేశంలో మన దగ్గర మా టీవీ లాంటివాటిని ఎన్నిటినో టేక్ ఓవర్ చేసింది. ఆ స్టార్ ను ప్రపంచంలోనే అతి పెద్ద డిస్ని కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే మాటీవీ…మొదట స్టార్ మా అయ్యింది. చిన చేపను పెద చేప…ఆ పెద చేపను తిమింగలం మింగడంతో మా స్టార్ డిస్ని అయి చివరి నామవాచకానికి ముందు పాత యాజమాన్యాలు విశేషణంగా నామరూపాల్లేకుండా మిగిలిపోతున్నాయి.

తెలుగు తప్ప మిగతా భాషల ఈ టీవీ ఛానెళ్లు ఎప్పుడో రిలయన్స్ పరమయ్యాయి. ఆ రిలయన్స్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా ఏయే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయో ఔత్సాహికులు గూగుల్ ను అడిగి తెలుసుకోగలరు.

ఎన్ డి టీ వీ లో చైనాకు సంబంధించిన కంపెనీల పెట్టుబడులున్నాయని గుసగుసలు ఉండనే ఉన్నాయి. తాజాగా ఎన్ డి టీ వి ని మన అదానీ కొన్నాడని వార్త. కొనలేదని ఎన్ డి టీ వి వివరణ.

చెన్నయ్ లో స్థిరపడ్డ తెలుగు వ్యాపార కుటుంబం ప్రారంభించిన జెమిని టివీని అదే చెన్నయ్ సన్ నెట్ వర్క్ టేక్ ఓవర్ చేసుకుంది.

తెలుగువాడు, సాత్వికుడు మురళీకృష్ణం రాజు ఆస్తులమ్ముకుంటూ నిలబెట్టిన మా టీ వీ లో మొదట నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, చిరంజీవి ప్రవేశించారు. దాంతో మురళీకృష్ణం రాజు అయిష్టంగానే డ్రైవింగ్ సీటు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. లేదా వెళ్లిపోయేలా చేసి ఉండవచ్చు. ఆయన వెళ్లగానే స్టార్ కు మా అమ్ముడుపోయింది- బహుశా రెండున్నర వేల కోట్లకు. నిమ్మగడ్డ బ్యాచ్ పెట్టిన పెట్టుబడికి రాబడి ఎంతో ఊహించుకోవచ్చు. ఆ నంబర్లు ఇక్కడ అనవసరం.

టీ వీ 9 మైహోం- మేఘా చేతుల్లోకి వెళ్ళింది. కమ్యూనిస్టు టెన్ టి వీ మైహోం చేతిలోకి వెళ్లింది. ఎన్ టీ వీ లో మైహోం- మేఘా పెట్టుబడులున్నాయి.

ఒక్క తెలుగులోనే కాదు. మిగతా భాషల్లో, మిగతా దేశాల్లో కూడా ఇదే ధోరణి. పెద్ద పెద్ద కంపెనీలకు మీడియా అవసరాలుంటాయి. నెగటివ్ వార్తలు రాకుండా ఉండడానికి, పాజిటివ్ వార్తల పబ్లిసిటీకి మీడియా తోడు కావాలి.

కుటుంబ వ్యాపారం చేస్తూ మీడియాలోకి దిగినవారు యాభై, వంద, రెండు వందల కోట్లకు ఆవిరైపోతారు. అలాంటివారిని గుర్తించి పెద్ద కంపెనీలు మొదట కొంత వాటా పేరిట వేలు పెడతాయి. తరువాత సందు చూసి మొత్తం చెయ్యి, ఆపై రెండు కాళ్లు పెట్టి పాత యాజమాన్యాన్ని తన్ని పంపిస్తాయి. ఇదంతా చట్టం అనుమతించిన పరిధిలోనే జరిగే పెను వ్యాపారం. నైతికత- ధర్మం- న్యాయం- సహజ న్యాయ సూత్రాలు వేరు వేరు అంశాలు. ఇంతకంటే లోతుగా వెళ్లడం ఇక్కడ అనవసరం.

అమ్మేవాడు అమ్ముకుంటున్నాడు. కొనేవాడు కొనుక్కుంటున్నాడు. ఇందులో అక్రమం ఏదీ లేనప్పుడు మనకెందుకు? అన్నది సాధారణ సిద్ధాంతం. అక్రమం ఏదీ లేకపోవచ్చు కానీ…ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో భారత్ గడ్డమీద కాలు పెట్టి రెండు వందల ఏళ్లు మన స్వాతంత్ర్యాన్ని చెరపట్టి, మనల్ను బానిసలుగా మార్చి, దుర్మార్గంగా మనల్ను పాలించిందని ఇప్పటికీ పాఠాలుగా చదువుకుంటున్నాం. వారినుండి స్వాతంత్య్రం వచ్చిందని ఆగస్టు పదిహేనును పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతున్నా పట్టనట్లు ఉంటున్నాం.

తాజాగా ప్రపంచ దిగ్గజ కంపెనీల చేతుల్లోకి దేశాలకు దేశాలు వెళ్లిపోతుండడం భవిష్యత్తులో పాఠాలు కాకుండాపోవు. పాఠం ఎప్పుడూ చదువుకోవడానికే. మార్కులకే. జాగ్రత్త పడడానికి కాదు.

ఎక్కడో హర్యానా గుర్ గావ్ పొలాల్లో బియ్యం అమ్ముకుంటూ ఇటుక ఇటుక పేర్చుకుంటూ దేశంలోనే గొప్ప మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన సుభాష్ చంద్ర సాహసం చదవదగ్గ పాఠం. ఎత్తుకు ఎదిగాక ఇతరేతర ఇన్ఫ్రా రంగాల్లో కాలు పెట్టి చేతులు కాల్చుకుని…చివరికి కొండ నాలుకకు మందు వేయబోయి ఉన్న అసలు “జీ” నాలుక కూడా పోగొట్టుకున్న అదే సుభాష్ చంద్ర విఫల పాఠం కూడా చదవదగ్గదే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

పోస్కో! పోస్కో!

Also Read:

ఎవడి గోల వాడిది

RELATED ARTICLES

Most Popular

న్యూస్