టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. నేడు జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే విసిరిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పెర్త్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి తొలి వికెట్ కు 42 పరుగులు చేసింది. అయితే అదే టెంపోను కొనసాగించలేక పోయింది. జట్టులో సీన్ విలియమ్స్-31; కెప్టెన్ క్రేగ్ ఎర్విన్-19; బ్రాడ్ ఎవాన్స్-19; మదెవెరే-17 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం జూనియర్ నాలుగు; షాదాబ్ ఖాన్ మూడు; హారిస్ రాఫ్ ఒక వికెట్ పడగొట్టారు.
పాక్ జట్టులో షాన్ మసూద్ 44 పరుగులతో రాణించాడు. టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ విఫలమైంది. చివర్లో మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్ విజయం జట్టును అంచుల వరకూ తీసుకెళ్ళారు. చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు కావాల్సిన సమయంలో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. తర్వాతి బంతికి నవాజ్ ఔటయ్యాడు. చివరి బంతికి షాహిన్ ఆఫ్రిది ఒక పరుగు తీసి రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీనితో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయం సొంతం చేసుకుంది.
జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా మూడు; బ్రాడ్ ఇవాన్స్ రెండు; ముజరబని, ల్యూక్ జోంగ్వే చెరో వికెట్ పడగొట్టారు.
సికందర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup2022: బంగ్లాపై సౌతాఫ్రికా భారీ విజయం