Monday, April 15, 2024
HomeTrending Newsకవిత వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి?

కవిత వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి?

రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. రాజకీయంగా మార్పులు జరుగుతాయని….అయితే ఎలాంటి మార్పులు జరిగినా అవి టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటాయని కవిత స్పష్టం చేశారు.

మంగళవారం జరిగిన జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పాలక వర్గం పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ తో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో కవిత స్పష్టత ఇవ్వలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటివల రాజకీయంగా జరుగుతున్న పరిణామాల పైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని గులాబి నాయకులు అంటున్నారు.

2004 నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్న ఎమ్మెల్యేల బ్యాచ్ కు కేటిఅర్ ను రాజకీయంగా ‘అందలం’ ఎక్కించడం ఇష్టం లేదనే చర్చ నడుస్తూ వస్తోంది, ఈ సమావేశంలో తనతో పాటు హాజరైన, అదే బ్యాచ్ కు చెందిన కొప్పుల ఈశ్వర్ కు ఆమె పరోక్ష హెచ్చరిక పంపారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొంత దుమారం లేపినా ఆ తర్వాత “ టీ ” కప్పులో తుపాన్ అని తేలిపోయింది. ఈటెల పార్టీ నుంచి బయటకు రావటం వెనుక ఓ సీనియర్ మంత్రి హస్తం ఉందని జోరుగా పుకార్లు ఉన్నాయి. ఆయనను దృష్టిలో ఉంచుకొని కవిత కామెంట్ చేశారా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఆమె చెబుతున్న మార్పులు రాజకీయమైనవా, కుటుంబ పరమైనవా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణను తెరాసలోకి తీసుకొచ్చే పని దాదాపుగా పూర్తయింది. అధికారికంగా చేరటం ఒక్కటే మిగిలిపోయింది. రమణ టిఆర్ఎస్ లో చేరడం ద్వారా రాష్ట్రంలో పెద్దగా జరిగే రాజకీయ మార్పులు ఏమీ ఉండవు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణాలో కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది.

ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ముహూర్తం ఖరారైందా ? తన సోదరుడు కేటిఅర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని నర్మగర్భంగా తెలియచేశారా? లేదా ప్రభుత్వం, పార్టీ నుంచి మరి కొందరిని బైటకు పంపి భవిష్యత్తులో కేటియార్ కు రాజకీయంగా ఎలాంటి వెన్నుపోటు లేకుండా చేసే పనిలో అధినేత కెసియార్ ఉన్నారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా తెరాస నేత కడియం శ్రీహరి చెప్పినట్టుగా తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి కెసిఆర్ ఒక్కరే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన అనుకుంటే నేతలు అందలం ఎక్కుతారు, లేదంటే అధినేత ప్రసన్నం లేక మరుగున పడుతారు. 2001 లో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కెసిఆర్ ను ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు ఎవ్వరూ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు.   ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల లోగుట్టు తెలియాలంటే కొద్దురోజులు వేచిచూడాల్సిందే.

– దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్