మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తథః కిమ్ ? అంటూ మన మనసును ఎక్కడ కేంద్రీకరించాలి అంటే గురువు పాదపద్మాలమీద అని గుర్వష్టకంలో శంకర భగవత్పాదులు చెప్పారు . గురువులేని విద్య గుడ్డి విద్య అన్న సామెత కూడా ఉంది.
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ లో స్కూలు, కర్నూల్ నగరంలో కాలేజ్ విద్య అభ్యసించి ఓ న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్… తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున చేస్తున్న ‘ గురువందనం’… ఆయన మాటల్లోనే….
సరస్వతి:
మా ఊరు కడిమెట్లలో సరస్వతి మేడమ్ ఎలిమెంటరీ టీచర్. బస్సు సౌకర్యంలేని మా ఊరుకు రోజూ రెండు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వచ్చేది. ఆటో, బైక్ లాంటి అవకాశం కూడా అప్పటికి లేదు. ఎలాగోలా కష్టపడి ప్రేయర్ టైమ్‌కి చేరుకునేది. వ్యవసాయ పనులకు ఎక్కువ మందిని పంపే మా ఊరిలో పిల్లలను బడిలో చేర్పించేందుకు చాలా కష్టపడేది. సాయంత్రం తిరుగుప్రయాణంలో కూడా అదే ఇబ్బంది. సరస్వతి టీచర్ భర్త కూడా మరో ఊరిలో టీచరే. కాబట్టి ఆమె సొంతంగా వచ్చిపోవాల్సిందే. అడవి…పొలాల మధ్య నుంచి వచ్చే టపుడు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. మేము కాస్త పై క్లాసులకు వచ్చాక ఈ రెండు కిలోమీటర్లు టీచర్‌తో నడిచి ఎర్రకోటలో ఆర్టీసీ బస్సు ఎక్కించి పంపేవాళ్లం. నాకు చదువుపై కాస్త ఇంట్రెస్ట్ కలగడానికి ఒక కారణం సరస్వతి టీచర్.
వెంకటసుబ్బమ్మ
ఎర్రకోట హైస్కూల్‌లో వెంకట సుబ్బమ్మ సైన్స్ టీచర్. ఊరి వాళ్లకు…స్కూల్లో టీచర్లు… పిల్లలందరికీ ఇన్‌ప్రిరేషన్ ఈ మోడ్రన్ టీచర్. టౌన్ నుంచి బైక్ పై వచ్చేది. ఒకవైపు తన పిల్లలను చదివించుకుంటూ టీచర్‌గా తన పాత్రలో ఎక్కడా లోపం లేకుండా చూసుకునేది. సబ్జెక్టు పిల్లల బుర్రకెక్క దాకా వదిలిపెట్టేది కాదు. ఇరవై…ముప్పై సార్లు కూడా రాయించేది. హోం వర్క్ వెంకట సుబ్బమ్మ టీచర్ దే ఎక్కువ ఉండేది. నాకు అన్ని సబ్జెక్టుల కంటే సైన్స్ లోనే ఎక్కువ మార్కులు వచ్చేవి.
ఓసారి లంచ్ చేసి క్యారియర్ కడుగుతుండగా నా వేలుపై బోరింగ్ మిషన్ పడిపోయింది. రక్తం కారుతుండటం చూసి తల్లిలాగా తల్లడిల్లిపోయింది. సుబ్బమ్మ టీచర్ ఇద్దరు పిల్లల్ని కూడా బాగా చదివించింది. కూతురు బిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా స్థిరపడింది. కొడుకు మనోజ్ చార్జెట్ అకౌంటెండ్. వెంకట సుబ్బమ్మ ఇంకా టీచర్‌గా పనిచేస్తున్నారు.
సుందరీభాయ్
ఎర్రకోట స్కూల్‌లో ఇంగ్లీషు టీచర్ సుందరీభాయ్. టీచర్ వృత్తి అంటే ఈమెకు ప్రాణం. రిటైర్డ్ అయి పదేళ్లు అయినా కాలేజీకి వెళ్లి ఇంకా క్లాసులు చెబుతోంది. నా చదువు మధ్యలో ఆగిపోకుండా కొనసాగడానికి వెంకట సుబ్బమ్మ, సుందరీభాయ్, సరస్వతి టీచర్లు కారణం. మా ఐదుగిరి సంతానంలో నేను ఒక్కడినే చదువుకున్నా. అక్క మాదేవి, చెల్లి శ్రీదేవి, తమ్ముడు వెంకటేష్ అసలు స్కూల్‌లోనే చేరలేదు. వారికి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్లు పొలం పనులే. మా అన్న కేశన్న ఎనిమిదో తరగతికి వెళ్లగానే ఆపేశాడు. నేను ఏడు పూర్తి చేసి ఎనిమిది వెళుతున్న సమయంలో ఇంట్లో పనులు ఆపేసే ప్రయత్నం చేశారు. మా అమ్మ లక్ష్మీదేవికి మాత్రం చదివించాలని ఉన్నా పొలం పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి ఉండేది. పిల్లవాడు బాగా చదువుతున్నాడు…చదివించండి అని వెంకట సుబ్బమ్మ, సుందరీభాయ్, సరస్వతి టీచర్లు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని ఒప్పించారు. వారిల్లే
పీజీ, ఎంఫిల్ పూర్తి చేయగలిగా.
మారుతి పౌరోహిత్యం:
ఓ మారుమూల పల్లెలో ప్రభుత్వ టీచరైన మారుతి టౌన్‌లో సాయంత్రం ప్రగతి టుటోరియల్స్ నడిపేది. వెనకబడిన ఈ ప్రాంతంలో పిల్లలకు ఇంగ్లీషు నేర్పించాలనేది మారుతి సార్ తాపత్రయం. అందులో ఆయన సక్సెస్ అయ్యారు కూడా. అలాగే టీటీసీ,బీఈడీ కోసం కోచింగ్ ఇచ్చేది. ఇంగ్లీషు, సోషల్, జనరల్ స్టడీస్ పై తన సబ్జెక్టులు. గట్టి పట్టు ఉండేది. స్టూడెంట్స్ కు ఇంట్రెస్ట్ కలిగేలా ఆసక్తిగా క్లాసులు చెప్పేది. వందలాది మంది ప్రభుత్వ టీచర్లుగా మారారు అంటే మారుతి సార్ చొరవ వల్లే. మారుతి సార్‌లో నాకు నచ్చిన మరో అంశం ప్రొగ్రెస్సివ్ థాంట్. కాస్త వామపక్ష భావాలున్న మారుతి సార్ వల్ల నేను కూడా ప్రభావితం అయ్యాను. అందరిలాగే విలేజ్ టీచర్‌గా ఉండిపోకుండా స్టేట్ కేపిటల్‌లో ఐఎఎస్ కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సర్వశిక్ష అభియాన్‌లో ఉద్యోగం చేస్తూ జిల్లాను అక్షరాస్యతలో ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.
డాక్టర్ మద్దయ్య
ఫర్ మెన్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ డాక్టర్ మద్దయ్య. హిస్టరీలో పిహెచ్‌డీ చేసిన మద్దయ్యకు చరిత్ర అంశాలు అంటే అమితమైన ప్రేమ. బిఎ లాంటి కోర్సులు చదివితే నిరుద్యోగులు అవుతారనే భయంతో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేలా చేశారు. బిఎలో జర్నలిజం కోర్సును పెట్టించి నా లాంటి ఎంతో మందిని అందులో చేర్పించారు. తన సబ్జెక్టు కాకపోయినా ట్రైనింగ్ తీసుకుని మరీ జర్నలిజం టీచ్ చేశారు. కోర్సు పూర్తయ్యాక కూడా జర్నలిజం వైపు వెళ్లేలా ప్రోత్సహించారు. ఆయన ద్వారా ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన
వందలాది మంది ఇప్పుడు న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్ లో కీలక పదవుల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేశారు డాక్టర్ మద్దయ్య.
డాక్టర్ అబ్దుల్ ఖాదర్
ఫర్ మెన్ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్. ఈజీగా అర్థం అయ్యేలా చెప్పే టాలెంట్ అయన సొంతం. దేశభక్తి భావాలు ఎక్కువ. పోటీ తత్వం పెంచడం ఖాదర్ సార్‌కు ఇష్టం. ఎవరినీ నిరుత్సాహంగా ఉండనీయరు. ఏదో సాధించాలని ప్రేరణ కలిగించేది. కాలేజీ తరపున ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేది. జాతీయు స్థాయిలో అవార్డులు…పేరు ప్రఖ్యాతులు సాధించారు. సమాజంపై అవగాహన ఎక్కువ.
సుబ్బారావు
మా హైస్కూల్ హెడ్ మాస్టర్. యమస్టిట్ టీచర్. ఎవరినీ వదిలిపెట్టే రకం కాదు. టీచర్లు ఆలస్యంగా వచ్చినా ఊరికునేది కాదు. పిల్లల చదువు విషయంలో రాజీ పడేవాడు కాదు. ఈ విషయంలో ఎవరితోనైనా గొడవపడేది. అమామాస్య, పౌర్ణమి పేరుతో స్కూల్ ఎగ్గొట్టే విద్యార్థుల్ని కూడా దారిలోకి తెచ్చాడు. మూడనమ్మకాలు అంటే అసలు పడేది కాదు. ఈ హెడ్ మాస్టర్ వల్ల ఎర్రకోట హై స్కూల్‌కి చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు వచ్చింది. నాలుగైదు గ్రామాల నుంచి పిల్లలు ఈ హై స్కూల్‌కి వచ్చేవాళ్లు. ప్రస్తుతం సుబ్బారావు సార్ లేరు.
– సోమగోపాల్
99483 75129