Saturday, January 18, 2025
Homeజాతీయంతమిళనాడులో కొంగునాడు వి’భజన'

తమిళనాడులో కొంగునాడు వి’భజన’

కలిసి ఉంటే కలదు సుఖం- ఇది సాధారణంగా వినిపించే నానుడి .రాజకీయాలకు మాత్రం ఈ సూత్రం వర్తించదు. వర్తించనివ్వరు. పార్టీల మాట మనకెందుకు గాని పార్టీలు పెట్టే చిచ్చు మాత్రం చర్చనీయాంశమే. ఇప్పుడు ఏ పార్టీ ఎవరి మధ్య చిచ్చు పెట్టింది అని ఆలోచిస్తున్నారా.. అదేనండి తమిళనాడు కొంగు బంగారమైన కొంగునాడు అదే కొంగు మండలం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. తమిళనాట విభజన రాజకీయాలకు ఇదో అస్త్రంగా మారబోతోంది. తమిళనాడు రాజకీయాలపై కొంచెం ఆసక్తి చూపే వారందరూ ఇప్పుడు ఈ కొంగునాడు కొంగు పట్టుకొని మరీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు విభజన దిశగా సాగుతోంది అంటూ హడావుడి రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ మాటకొస్తే ఆలు లేదు.. చూలు లేదన్న చందంగా ఆ రాష్ట్రంలో ,ఆ కొంగునాడు ప్రాంతంలోనూ ఎలాంటి చర్చలు లేకున్నా… ఆ దిశగా చర్చలు జరిగేలా కొందరు, కొన్ని వర్గాలు ప్రేరేపిత రాజకీయాలు చేస్తున్నాయి. దొరికిందే సందని విషయం ఏమీ లేకున్నా భూతద్దంలో చూపే ప్రయత్నం మన మీడియా బాగానే చేస్తోంది.

ఇదంతా సరే-తమిళనాట కొంగునాడు విషయమేమిటని ఓ సారి తొంగిచూస్తే... తమిళనాడులో మిగిలిన ప్రాంతాల కన్నా సుసంపన్నమైన ఆ పశ్చిమ ప్రాంతమే కొంగునాడు. దానిపై కేంద్రంలోని బీజేపీ పెద్దల చూపు పడిందని చిన్న టాక్. పెద్దలెవరూ ఈ విషయంలో నోరు విప్పలేదు గాని తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితాలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎల్ మురుగన్ పేరు పక్కన కొంగునాడు తమిళనాడు అని ఉండటం ఆసక్తిగా మారి చిలువలు పలవలుగా మారి కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం ప్రస్తావన పెద్ద టాక్ అయి కూర్చుంది. ఎప్పుడూ ఏదోఒక హాట్ టాపిక్ తో ప్రజల మధ్య ఉండాలని చూసే ఎల్.మురుగన్ కూడా కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం అయితే ఏమవుతుంది అన్న రీతిలో స్పందించటం వేడి పెంచింది.

తమిళనాడును విభజించి కొంగునాడు ను ప్రత్యేక రాష్ట్రంగా లేక కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం మారుస్తోందంటూ కేంద్రం మనసులోకి దూరిమరీ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా చాటింపు వేయటం మొదలెట్టింది .

కొంగునాడు పశ్చిమ తమిళనాడు ప్రాంతం . మొత్తం 38 జిల్లాలను కలిగివున్న తమిళనాడులో పడమరలో పది జిల్లాలకు పరిమితమైన ప్రాంతం ఇది. 10 లోక్ సభ స్థానాలు 61 అసెంబ్లీ స్థానాలు కొంగునాడు పరిధిలో ఉన్నాయి. రాజకీయంగా చూస్తే ఎంజీఆర్ టైం నుంచి కొంగునాడు అన్నాడీఎంకేకు మంచి పట్టున్న ప్రాంతం. డీఎంకేకు మాత్రం కొంగునాడు కొంగు చిక్కటం లేదు. కొంగునాడులో పట్టు కోసం డీఎంకే ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మక్కల్ నీది మయ్యం మాజీ ప్రధాన కార్యదర్శి మహేంద్రన్ ఎన్నికల ముందు డీఎంకేలో చేరిన సందర్భంలో ఇక కొంగునాడులో డిఎంకె బలపడుతుందని పార్టీ అధినేత స్టాలిన్ అన్న మాటలే ఆ ప్రాంతంలో డీఎంకే పరిస్థితికి అద్దం పట్టాయి.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తమిళనాట డీఎంకే విజయం సాధించినా, కొంగునాడు ప్రాంతంలో అన్నాడీఎంకే నే అధిక స్థానాలు సాధించింది. కొంగు మండలంలో 40 అసెంబ్లీ స్థానాలు డిఎంకె కైవసం చేసుకోగా ,డిఎంకె 17 సీట్లకు పరిమితమైంది. అయితే కొంగునాడు లో బీజేపీకి కూడా ఓటు బ్యాంకు పరంగా కొంత పట్టుంది. ఆ ప్రాంతానికే పరిమితమైన ప్రాంతీయ పార్టీ కొంగునాడు మున్నేట్ర కళగం కూడా బీజేపీకి మద్దతు గా ఉంటూ వస్తోంది. బెస్ట్ రామస్వామి నాయకత్వంలో ఉన్న కొంగునాడు మున్నేట్ర కళగం మాత్రం ఆ ప్రాంతం సపరేట్ కావాలని ఆకాంక్షిస్తోంది. ద్రావిడ వాదాన్ని బలంగా నమ్మే తమిళ ప్రజలు మాత్రం రాష్ట్ర విభజన కోరుకోవడం లేదు.
తమిళనాడు మొత్తం ఆదాయంలో 65 శాతం పన్ను రాబడి ,కొంగునాడు ప్రాంత జిల్లాలైన కోయంబత్తూరు ,తిరుప్పూర్, ఈరోడ్ ,నామక్కల్ , సేలం, ధర్మపురి , నీలగిరి ,క్రిష్ణగిరి, కరూర్, దిండుగల్ లో నుంచి వస్తుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు కొంగునాడు లో తిరిగి ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తి మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంత వాసుల్లో నెలకొని ఉంది.

కులాలు,సామాజికవర్గాల పరంగా అధిక ప్రాధాన్యం ఉండే తమిళనాడులో కొంగునాడు ప్రాంతంలో kongu vellala gounder సామాజిక వర్గానిదే పై చేయి. పారిశ్రామికంగా దేశంలోనే ప్రసిద్ధి చెందిన కొంగునాడు ప్రాంతం , ఆయా జిల్లాలూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథం లోనే ఉంటాయి. అయితే ఆ పది జిల్లాలలో తెలుగు వారితో పాటు మిగిలిన భాషలకు చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువే. అందుకే తమిళనాట కొంగునాడు తొలినుంచి ప్రత్యేకమైనదే. ప్రాచీనమైన సంగం లిటరేచర్ లోనూ కొంగు మండళ ప్రత్యేక ప్రస్తావన ఉంది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం మాటను మాత్రం అధికార డీఎంకే తో సహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలను సాగనివ్వబోమని అధికార డిఎంకె గట్టిగానే హెచ్చరించింది. ఆ పార్టీ నాయకురాలు కనిమొళి ఘాటుగా స్పందించారు కూడా. బిజెపి ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కరునాగరన్ వంటి ఒకరిద్దరు ప్రజాభీష్టం మేరకు కేంద్రం నడుచుకుంటుంది అని సన్నాయి నొక్కులు నొక్కినా బీజేపీ పరంగా అధికారికంగా కొంగునాడు పై ఎవరూ స్పందించలేదు. అధికార డిఎంకె ఎందుకు ఉలికి పడుతోందని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా తమిళనాడు భవిష్యత్తు రాజకీయాల మీద కొంగునాడు విభజన ఆధారపడి ఉంది.

తమిళనాడు ను విడగొట్టి తమకు బలం ఉన్న కొంగునాడులో అన్నాడిఎంకె తో కలిసి విజయం సాధించవచ్చని బీజేపీ నేతల మనసులో మాట గా ఉంటే ఉండొచ్చేమో గాని, ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు మాత్రం కష్టసాధ్యమే. డీఎంకే ను ఎదుర్కొనే ఎత్తుగడే కావచ్చు గాని, ఇక రాష్ట్రం విడిపోవాలంటే ఆ ప్రాంతంలో ప్రజల బలమైన ఆకాంక్ష ఎంతో ముఖ్యం. తెలంగాణాతో సహా మిగిలిన రాష్ట్రాల విభజన సమయంలోనూ ఇదే జరిగింది. మరి కొంగునాడు భవిష్యత్తు కూడా ఈ ప్రాంత ప్రజల చేతుల్లోనే ఉంది. అందుకే కొంగునాడు విభజనపై కొంచెం తగ్గి మాట్లాడుకుంటేనే మంచిది మరి.

-వెలది. కృష్ణ కుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్