కరోనా నిబంధనలను, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల మేరకు వాహనాలు జప్తు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిబంధనలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం రేపటినుండి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఎటువంటి రాజకీయ పార్టీల సభలు, సమావేశలకు అనుమతి లేదని, నిర్ధారణ కాని వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అప్రమత్తం గా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలలని, అత్యవసర సమయంలో బయటకు వెళ్లినప్పుడు రెండు మాస్క్ లు ధరింఛి, శానిటైజర్ ను ఉపయోగించాలని డిజిపి సూచించారు.
కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలని… జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా ని సమర్థవంతంగా జయిస్తామని అన్నారు. .
బాధితులు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు.