Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహనుమ వినయం- లంకా విజయం

హనుమ వినయం- లంకా విజయం

“జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః,
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః,
దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః,
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః,
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః,
అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్,
సమృద్ధార్థో గమిష్యామి మిహతామ్ సర్వ రాక్షసాం”

వాల్మీకి రామాయణంలో సుందరకాండలో శ్లోకాలివి. చాలా ప్రసిద్ధం. మాలా మంత్రంగా అంటే జపం, పారాయణం చేసుకోదగ్గ మంత్రాలుగా వ్యాప్తిలో ఉన్నవి.

సందర్భం:-
సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు వంద యోజనాల సముద్రం దాటి లంకలో దిగుతాడు. ఒక్క అంగుళం వదలకుండా అంతా వెతుకుతాడు. కానీ, సీతమ్మ జాడ దొరకదు. అలసిపోతాడు. నిరాశపడతాడు. జటాయువు సోదరుడు సంపాతి సరిగ్గానే చూసి చెప్పాడు కదా? తీరా ఇంత దూరం వచ్చాక సీతమ్మ కనపడడం లేదేమిటి అని బాధపడతాడు. నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక ఎత్తయిన పర్వతం ఎక్కి, గట్టిగా ఊపిరి పీల్చుకుని, ప్రశాంత చిత్తంతో రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, సీతమ్మను తలచుకుని మళ్లీ సీతాన్వేషణకు బయలుదేరతాడు. ఆ క్షణంలో ఈ ధ్యాన శ్లోకాలు పూర్తి కాగానే దూరంగా అశోక వనం, అందులో ఒక చెట్టు కింద సీతమ్మ కనపడుతుంది. ఏ కష్టమయినా తొలగిపోవాలంటే ఈ జయత్యతి బలో రామో పఠించాలని అప్పటినుండి ఆచారంగా మారింది.

అర్థం:-
బలవంతుడయిన శ్రీరాముడికి సదా జయం. పరాక్రమశాలి అయిన లక్ష్మణుడికి జయం. శ్రీరాముడికి విధేయుడై, కిష్కింధకు ప్రభువయిన సుగ్రీవుడికి జయం. అసహాయ శూరుడు, కోసల రాజ్యాధిపతి అయిన రాముడికి నేను బంటును. వాయుపుత్రుడిని. నా పేరు హనుమ.

శత్రు సైన్యాలను నామరూపాల్లేకుండా చేస్తాను. ఒకడేమిటి? వెయ్యిమంది రావణులు కలిసి ఒకేసారి వచ్చినా ఓడిస్తాను. రాళ్లతో, చెట్లతో రాక్షసులను మట్టికరిపిస్తాను. లంకానగరాన్ని నాశనం చేస్తాను. రాక్షసులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉండగా వచ్చినపని ముగించుకుని సీతమ్మను దర్శించి, నమస్కరించుకుని వచ్చినదారినే వెళ్ళిపోతాను.

మొత్తం రామాయణంలోనే హనుమ చెప్పే ఈ మాటలు చాలా గొప్పవిగా, ప్రభావవంతమయినవిగా ఆధ్యాత్మివేత్తలు చెబుతారు. నేను అంత, నేను ఇంత అని హనుమ ఎక్కడా చెప్పుకోలేదు. బయలుదేరడానికి ముందే యథా వినిర్ముక్తస్య రాఘవ బాణం . . . అని రాముడు వదిలిన బాణంలా వెళ్లివస్తాను అని క్రెడిట్ అంతా రాముడికే ఇచ్చాడు. వంద యోజనాల దూరం దాటి లంకలో ల్యాండ్ అయ్యాక హనుమ నుదుటిమీద చెమటచుక్కకూడా పట్టలేదన్నాడు వాల్మీకి. గోష్పదీ కృత వారాశీమ్ . . . ఆవు కాలి గిట్ట చేసిన గుంత దాటినంత అవలీలగా హనుమ సముద్రం దాటాడట.

రాముడు చాలా గొప్పవాడు, లక్ష్మణుడు పరాక్రమశాలి. మా ప్రభువు మంచివాడు. సీతమ్మకు నమస్కారం. ఇలాంటివారి నీడలో రాముడి బంటునయిన నాకు పరాజయం ఎందుకుంటుంది? లంకలో ఒక్కొక్కరిని ఆడుకుంటాను- అని తనబలం తనుకాదు, తన వెనకున్నవారే అని నమ్మకంగా, వినయంగా చెప్పుకున్నాడు. భాషలో, భావంలో వాల్మీకి ప్రయోగాలు, చమత్కారాలు చెప్పీ చెప్పకుండా ఉంటాయి. మొదటి మాట జయతి- అంటే ఎప్పటికీ జయం కలుగుతూనే ఉంటుంది అని. Present perfect continuous tense వాడాడు. అలాగే అందరూ గొప్పవాళ్లే అయినా – రామస్య క్లిష్ట కర్మణః అన్నాడు. చాలా కష్టమయినపనులను అవలీలగా, హేలగా, సునాయాసంగా చేసే రాముడట. అలాంటి రాముడి బంటునయిన నాకు ఎదురేముంది? అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఉత్సాహం నింపుకున్నాడు. కార్యం సాధించాడు. తోకకు నిప్పుపెడితే లంకను కాల్చి, సముద్రంలో తోకను చల్లబరుచుకున్నాడు. ఈ సందర్భంలో పుట్టిందే – చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు – సామెత.

హనుమ విశ్రాంతి తీసుకుని- జయత్యతి బలో రామో – అని ధ్యానించిన ఎత్తయిన కొండ ఇదే అని శ్రీలంక పర్యటనలో నువార ఎలియా నుండి క్యాండీ పట్టణానికి వెళ్లే మార్గమధ్యంలో మాకు చూపించారు. చిన్మయ మిషన్ వారు ఈ కొండమీద పెద్ద హనుమ విగ్రహం ప్రతిష్ఠించి గుడి కట్టారు.
జయత్యతి బలో రామో చదువుకుని మా కష్టాలు, అడ్డంకులు తొలగించు స్వామీ! అని నమస్కారం పెట్టుకుని కొలొంబో దారి పట్టాము.

(పాత వ్యాసం)

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్