టి20పురుషుల వరల్డ్ కప్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ ఆశలు నిలబెట్టుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇప్పటికే గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది, రెండో జట్టు ఏంటనేది రేపు తేలనుంది. ఆసీస్ సెమీస్ ఆశలు రేపటి శ్రీలంక-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. శ్రీలంక గెలిస్తే ఆసీస్ నేరుగా సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఇంగ్లాండ్ గెలిస్తే మెరుగైన రన్ రేట్ ఆధారంగా ఇంగ్లాండ్ బెర్త్ సంపాదించుకుంటుంది.
అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఆఫ్ఘన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ 22 పరుగుల వద్ద ఓపెనర్ గ్రీన్ (3) వికెట్ కోల్పోయింది. జట్టులో గ్లెన్ మాక్స్ వెల్ -54; మిచెల్ మార్ష్-45; వార్నర్-25; స్టోనిష్-25 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు; ఫజల్హక్ ఫారూఖి రెండు; ముజీబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
తర్వాత ఆఫ్ఘన్ 15 పరుగులకు తొలి వికెట్ ( ఉస్మాన్ ఘని-2) కోల్పోయింది. గుల్బడిన్ నయీబ్-39; రహమతుల్లా గుర్జాబ్-30; ఇబ్రహీం జార్డాన్-26 పరుగులతో రాణించారు.
32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన గ్లెన్ మాక్స్ వెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది
Also Read : ఐర్లాండ్ పై గెలుపు – సెమీస్ కు కివీస్!