తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ. 1 లక్ష 24 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 2 లక్షల 78 వేలతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. నాడు రాష్ట్ర బడ్జెట్ రూ. 62 వేల కోట్లు కాగా, ప్రస్తుతం రూ. 1 లక్షల 84 వేల కోట్ల బడ్జెట్ ఉందన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో 750 మీటర్ల భారీ జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, ఎమ్మెల్యే మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గాంధీ కలలను సాకారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. 20 సంసద్ ఆదర్శ్ గ్రామాల జాబితాలో 19 మనవే ఉన్నాయని చెప్పారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులతో సంగారెడ్డి దశదిశ మారనుందని స్పష్టం చేశారు. ఈ జిల్లాలో కొత్తగా 42 వేల ఆసరా పెన్షన్లు రాబోతున్నాయని తెలిపారు. ఆగస్టు 15న ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.