ఆంధ్ర ప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి ఆయన లేని సమయంలో పోలీసులు వెళ్లి హంగామా సృష్టించడాన్నిఅయన ఖండించారు. ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంమని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి సిఎం దిగజారాడని మండిపడ్డారు.
సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే, డ్రైవర్ పై దాడి చెయ్యడం ఎందుకని ప్రశ్నించారు. కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారని, రాష్ట్రంలో రోజుకో సిఐడి కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదని విమర్శించారు
ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్దతిలో సమాధానం చెప్పాలని, సిఐడిని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Also Read: ఏపీ సిఐడి అదుపులో నారాయణ