రాష్ట్రంలో అన్ని వర్గాలూ మానసిక క్షోభ అనుభవిస్తున్నాయని, ఆఖరికి మీడియాను కూడా సిఐడితో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలకు టిడిపి కార్యకర్తలు అసలు బైటకు కూడా రాలేని పరిస్థితి తెచ్చారని, ఆ సమయంలో తాను చేపట్టిన ‘బాదుడే బాదుడు’తో కార్యకర్తల్లో ఓ మనోధైర్యం వచ్చిందని బాబు వివరించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ పెట్టడంలేదని బాబు ప్రశ్నించారు, సిఎం స్పందించకపోవడం వల్లే విచ్చల విడిగా డ్రగ్స్ రవాణా జరుగుతోందని విమర్శించారు. నెల్లూరులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
అక్రమ కేసులతో టిడిపి నేతలను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు కూడా కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, తాము వచ్చిన తరువాత వారి పనితీరును సమీక్షించి తప్పుడు పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2022 సంవత్సరంలో ఈ ప్రభుత్వ దమనకాండ తారాస్థాయికి చేరుకుందని, కొత్త సంవత్సరం తప్పకుండా మార్పు వస్తుందని, ఈ పాలన అంతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతల్లో కూడా అంతర్మధనం మొదలైందని, అందుకే వారు కూడా బైటకు వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. అసలు సర్పంచ్ లు వైసీపీలో ఎందుకు ఉండాలో చెప్పాలన్నారు. సచివాలయం అనేది సర్పంచ్ ల కింద పని చేయాల్సి ఉంటుందని, కానీ వాలంటీర్లు అన్నిటా పెత్తనం చెలాయిస్తున్నారని, ఈ విషయంలో సర్పంచ్ ల్లో కూడా అసహనం పెరుగుతోందని అన్నారు.
ఆత్మాభిమానం, రాష్ట్రం మీద గౌరవం ఉన్నవారెవరూ వైఎస్సార్సీపీలో ఉండలేరన్నారు. ఎవరైనా మంచి వారు అక్కడినుంచి మా పార్టీలోకి రావాలనుకుంటే ఆహ్వానిస్తామని, వారిని ఎక్కడో ఒక చోట అవకాశం కల్పిస్తామని బాబు ప్రకటించారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి దృష్ట్యా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని, డబ్బులతో గెలవాలని ప్రయతిస్తున్నారని, ఒక్కో ఓటుకు పదివేల రూపాయలు అయినా సరే ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోందని బాబు వెల్లడించారు. వైఎస్సార్సీపీకి ఓటమి భయం పట్టుకుందని, రాష్రంలో ఐదుకోట్ల మంది ఒక పక్క, జగన్ ఒక మరో పక్క ఉన్నారని..వీరిద్దరి మధ్య జరిగే పోరాటంలో…. ప్రజల ఆలోచనలు… ఉదయం అన్ స్టాపబుల్.. టిడిపి కూడా అన్ స్టాపబుల్…. అధికారం రావడం కూడా అన్ స్టాపబుల్ అని… ఎవ్వరూ దీన్ని ఆపలేరని… తిరిగి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 2023 రాష్ట్రానికి కొత్త విశ్వాసం కలిగించాలని, రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.