తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది. దీనికి బాధ్యతగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, అందులో భాగంగా కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని కోరింది. గ్రూప్-1, ఏఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చిన టాస్క్ ఫోర్స్ కమిటీ మిగిలిన ప్రశ్నా పత్రాల లీకేజీ, రాబోయే 3 నెలల్లో జరగబోయే ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. పరీక్షల రద్దుతో కోచింగ్, హాస్టల్ వసతి పేరుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వారందరికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. దీంతోపాటు గతంలో ప్రకటించిన షెడ్యూల్ లోపే ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియమకాల భర్తీని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. కమిటీ కన్వీనర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టి.క్రిష్ణప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా జాతీయ పాలసీ రీసెర్చ్ కన్వీనర్ కరుణా గోపాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
పబ్లిక్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం.. .కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంతా ఛైర్మన్ పరిధిలోనే ఉండాలి. నిపుణుల ద్వారా పేపర్ సెట్టింగ్, సెక్యూరిటీ ప్రింటింగ్ ద్వారా పేపర్ ప్రింటింగ్ సహా వాటిని సంబంధిత కేంద్రాలకు చేరే వరకు పూర్తి బాధ్యత ఛైర్మన్ దే… కానీ ఆ ప్రశ్నాపత్రాలన్నీ ఇతరులకు ఎట్లా బదిలీ అయ్యాయి? దీని వెనుకాల ఎవరున్నారు? ఛైర్మన్ పై ఏమైనా ఒత్తిడి ఉందా? కింది స్థాయి సిబ్బందికి నేరుగా ప్రగతి భవన్ కు లింకులున్నాయా?‘‘అనే అంశంపై చర్చించారు.
• సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మీ కంప్యూటర్ నుండి పెన్ డ్రైవ్ ద్వారా ప్రవీణ్, రాజశేఖర్ డౌన్ చేసుకోవడం ఎలా సాధ్యమైంది? టీఎస్పీఎస్సీలోని అంతర్గత కంప్యూటర్ల నిర్వహణ పూర్తిగా ఐటీ శాఖ పరిధిలోని సీజీజీ, టీఎస్టీఎస్ చూస్తున్నాయి.
• కేంద్రం 2011లో చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే అన్ని శాఖల్లోని ఐటీ విభాగాలు తప్పనిసరిగా కేంద్రం నియమించే థర్డ్ పార్టీ నిర్వహించే సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ పొంది ఉండాలని, కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ద్వారా ఐటీ సేవలందిస్తున్న ఏ ఒక్క వెబ్ సైట్ కు కూడా ఆడిట్ సర్టిఫికెట్ లేదనే విషయం సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించారు.
• టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతోపాటు ధరణి స్కాం, జీహెచ్ఎంసీ ఫేక్ సర్టిఫికెట్స్ స్కాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెల్లింపుల స్కాం సహా, సెక్యూరిటీ సర్టిఫికేట్ లేని కారణంగా ఇరిగేషన్ శాఖలోని టెండర్ల నిర్వహణలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికంతటికీ ఐటీ శాఖ పరిధిలోని ఉద్దేశపూర్వక లోపాలే కారణమని అంచనాకు వచ్చింది.
టాస్క్ ఫోర్స్ కమిటీ రేపు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను కలవాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల రద్దు కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గవర్నర్ అందజేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్ణయించింది.
Also Read : పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆరే – బండి సంజయ్ ఫైర్