Tuesday, September 17, 2024
HomeTrending Newsచైనా ఆగడాలు... కెన్యా అగచాట్లు

చైనా ఆగడాలు… కెన్యా అగచాట్లు

ఆఫ్రికాలో చైనా ప్రాజెక్టులపై ప్రజలు, ప్రభుత్వాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న చైనా కంపెనీలు…  నిబంధనలు  ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కెన్యా ప్రభుత్వం చైనా ప్రాజెక్టులపై పునః సమీక్ష జరుపుతోంది. కెన్యా రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. కెన్యా పోలీసు, సైనిక బలగాలకు చైనా సరఫరా చేసిన డ్రోన్లు నాసిరకంగా ఉన్నాయని, అనేకసార్లు టార్గెట్ చేరకుండానే కూలిపోయాయని ప్రభుత్వ వర్గాలు వాపోతున్నాయి. డ్రోన్లు సరఫరా చేస్తున్న మెస్సర్స్ CETCI అఫ్ చైనా కంపెనీని బ్లాకు లిస్టులో చేర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాబోయే నెల రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కెన్యా రాజధాని నైరోబిలో అభివృద్ధి పనులు చేస్తున్న చైనా కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నైరోబి మెట్రోపాలిటన్ సర్వీసెస్ (NMS)లో భాగంగా రోడ్లు, మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ పనులు చైనాకు చెందిన చైనా రోడ్ అండ్ బ్రిడ్జి కార్పొరేషన్ ( CRBC) సంస్థ చేస్తోంది. ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టక పోవటంతో నగరంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. చైనా కంపెనీల నిర్వాకానికి ఇప్పటికే అనేకమంది వాహనదారులు మృత్యువాత పడ్డారు. పనులు నత్త నడకన సాగడంతో ఆర్థిక అంచనాలు పెరిగి ప్రభుత్వానికి తలకు మించిన బారంగా పరిణమించాయి. పనుల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నా చైనా కంపెనీలు పేడ చెవిన పెడుతున్నాయి. CRBC కంపనీకే వెస్ట్రన్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కట్టబెట్టారు. చైనా ఆర్థిక సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కెన్యాకు గుదిబండగా మారింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఒప్పందానికి విరుద్దంగా టోల్ చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై కెన్యా పౌరులు గోగ్గోలు పెడుతున్నారు. 2009లో ఇదే కంపనీ పిలిప్పిన్స్ లో అవకతవకలకు పాల్పడటంతో ప్రపంచ బ్యాంకు CRBC ని బ్లాక్ లిస్టులో చేర్చింది.


చైనా కంపెనీలతో ఆర్థిక బారం పాటు కెన్యాకు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. రహదారుల నిర్మాణంలో రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేయాల్సి ఉండగా చైనా కంపెనీలు అడ్డంగా పడగొడుతున్నాయి. దీనిపై కెన్యా పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీలను కట్టడి చేయక పోతే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన గతే కెన్యాకు పడుతుందని కెన్యా రాజకీయ పార్టీలు, ప్రజలు తరచుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమీక్ష చేస్తున్న ప్రభుత్వం నెల రోజుల్లో చైనా కంపెనీలతో ఒప్పందాలను సమీక్ష చేస్తామని ప్రకటించింది.
లోపాయికారిగా చైనా నుంచి లబ్ది పొందిన కెన్యా ప్రభుత్వ వర్గాలు, అధికార వర్గాలు… చైనా కంపెనీలను కట్టడి చేసే అవకాశం కనిపించటం లేదు. దీంతో చైనా ఆడిందే ఆట పాడిందే పాటగా కెన్యాలో సాగుతోంది. ఇటీవల ప్రజల నుంచి ఒత్తిడి పెరగటంతో కటినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని కెన్యా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Also Read : గల్ఫ్ దేశాలపై చైనా ఒత్తిడి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్