సంక్రాంతి అంటే.. సినిమాల పండగ అని చెప్పచ్చు. అందుకే తమ సినిమాలను ఈ పండుగకు రిలీజ్ చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు పోటీపడుతుంటారు. అయితే ఈసారి సంక్రాంతికి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సై అంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో ప్రస్తుతం దర్శకుడు బాబీ పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న107వ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో కూడా కథానాయికగా శృతిహాసనే నటిస్తుండడం విశేషం. ఈ మూవీని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి మారిందని సమాచారం. అయితే.. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అందుచేత ఈ రెండు చిత్రాలు పోటీపడకపోవచ్చనే మరో టాక్ కూడా ఉంది. మరి.. సంక్రాంతికి చిరు, బాలయ్య పోటీపడతారో లేదో అనేది తెలియాల్సివుంది.
Also Read : సంక్రాంతికి బరిలో ఏజెంట్?