కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ కుటుంబీకులెవరూ పోటీ చేయడం లేదని మొదటి నుంచి ప్రచారం జరగడంతో.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాత శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ రేసులోకి వచ్చారు. రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా తర్వాత.. ఎన్నికల బరి నుంచి అశోక్ గహ్లోత్ తప్పుకున్నారు. చివరకు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఆఖరి నిమిషంలో మరో కీలక నేత పేరు వినిపిస్తోంది. ఆయనే మల్లిఖార్జున ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున కూడా పోటీచేస్తారని తెలుస్తోంది. నిన్నరాత్రి సోనియా గాంధీతో ఆయన మాట్లాడారట. ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఆమెతో చర్చించారు.
అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరి రోజు. ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇవాళ నామినేషన్లు వేస్తామని శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ ఇది వరకే ప్రకటించారు. వీరితో పాటు మల్లిఖార్జున ఖర్గే కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే జరిగితే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మద్దతు కూడా మల్లిఖార్జున ఖర్గేకే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశముందని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఖర్గేపై కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లిఖార్జున ఖర్గే ఎల్లప్పుడూ అధ్యక్ష బరిలో నిలిచేందుకు అర్హుడని.. ఐతే ఆయన వయస్సు, రాజ్యసభలో విపక్ష నాయకుడిగా ఉన్నందున సందేహాలు ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణకు ఈ రోజు ఆఖరు కాగా రేపు నామినేషన్లను పరిశీలించి అర్హులైన వారి జాబితాను ప్రచురిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు వారం రోజుల పాటు సమయం ఉంటుంది. అందుకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. అక్టోబరు 19న ఓట్లను లెక్కించి..ఫలితాలను ప్రకటిస్తారు.
Also Read :