ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. విచారణకు తాను హాజరుకాలేనని తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వివరాలను ఈడి అధికారులకు ఈమెయిల్ ద్వారా పంపారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 11న జరిగిన విచారణ సమయంలో అడిగిన పత్రాలను న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడి అధికారులకు పంపారు. అయితే విచారణకు గైర్హాజరుకావడంపై ఈడి అంగీకరించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళలను ఈడి కార్యాలయానికి పిలిచి విచారణ జరపడంపై ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం 24 వ తేదికి వాయిదా వేసింది.
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని మరోసారి ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణ…పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు చర్చిస్తున్నారు.
మరోవైపు ఈడిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత తరపు న్యాయవాది, BRS ప్రధాన కార్యదర్శి సోమా భరత్… కవిత తరపున డాక్యుమెంట్స్ ఈడీకి అందించామన్నారు. కవితపై కేంద్రం కక్ష గట్టిందని, తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విచారణలో నిబంధనలు ఉల్లంఘించారని, మహిళలను ఇంటి దగ్గర మాత్రమే ప్రశ్నించాలని ఆయన అన్నారు. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామని BRS ప్రధాన కార్యదర్శి సోమ భరత్ వెల్లడించారు.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..