Sunday, January 19, 2025
HomeTrending Newsఅమ్మా! స్వర్గంలో కలుస్తాను

అమ్మా! స్వర్గంలో కలుస్తాను

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన తల్లికి ఉక్రెయిన్ చిన్నారి రాసిన లేఖ….

ఆకాశంలో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ  ఉక్రెయిన్ కు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఉక్రెయిన్ మీద రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి జొరబడిన రష్యా సైన్యం జరుపుతున్న దాడులలో ఉక్రెయిన్ కు చెందిన లక్షల మంది బాధలు పడుతున్నారు. వేలాది మంది మరణించారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నలబై లక్షల మందికిపైగా ఇరుగుపొరుగు దేశాలకు శరణార్థులుగా తరలిపోయారు. ఈ స్థితిలో తొమ్మిదేళ్ళ చిన్నారి రాసిన లేఖను ఉక్రెయిన్ కు చెందిన మంత్రి సహాయకుడు ఆంటన్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు.

అమ్మా నీకీ లేఖను (మార్చి ఎనిమిదో తేదీన)
నీకు ప్రేమకానుకగా సమర్పిస్తున్నాను. నాకు తొమ్మిదేళ్ళపాటు మంచి జీవితాన్నిచ్చిన నీకు కృతజ్ఞతలు. నా బాల్య ప్రాయాన్ని చక్కగా నడిపించిన నీకు నేను రుణపడి ఉన్నాను. ప్రపంచంలో గొప్ప తల్లివి నువ్వు. నిన్ను నేను మరవనే మరవను. ఆకాశాన నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. స్వర్గానికి నువ్వెళ్ళాలి. మనం స్వర్గంలో కలుసుకుందాం. మంచి అమ్మాయిగా ఉండి స్వర్గానికి రావడానికి ప్రయత్నిస్తాను.

ప్రియమైన ముద్దులతో కలియా అంటూ ఆ చిన్నారి ఈ ఉత్తరం రాసింది.

ఈ చిన్నారి తల్లి బోరోడ్యంకా అనే ప్రదేశంలో రష్యా సైన్యం జరిపిన దాడిలో మరణించింది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దాడులతో ఐరోపా ఖండం యావత్తు ఆందోళనలో ఉంది.

– యామిజాల జగదీశ్

Also Read :

నాటో స్వార్థానికి ఉక్రెయిన్ బలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్