Sunday, January 19, 2025
HomeTrending Newsమీటర్లపై తప్పుడు కథనం: పెద్దిరెడ్డి ఫైర్

మీటర్లపై తప్పుడు కథనం: పెద్దిరెడ్డి ఫైర్

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే విషయమై తెలుగుదేశం పార్టీ, కొన్ని రైతు సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతులందరూ మీటర్ల విషయంలో సుముఖంగానే ఉన్నారని, స్మార్ట్ మీటర్లు  పెట్టడం ద్వారా నాణ్యమైన విద్యుత్ పొందుతామని వారు కూడా ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల 58 వేల మీటర్లు అమర్చబోతున్నామని తెలియజేశారు. ‘రైతు చెనుకు కడప మీటర్‌’ పేరిట ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. నేడు తిరుపతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఆ పత్రిక పూర్తి అవాస్తవ కథనం రాసిందని,  సిఎం వైఎస్ జగన్ వినూత్నంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆ పత్రిక యజమాని  ఓర్వలేకపోతున్నారని, అందుకే తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారన్నారు. వారు రాసిన కథనంలోని కంపెనీకి కాంట్రాక్టు ఎప్పుడో రద్దు చేశామని చెప్పారు. కొత్త అంచనాల ప్రకారం దాదాపు ఒక్కో మీటర్ 6 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.11.50 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని, త్వరలోనే దీనికోసం టెండర్లు పిలుస్తామని, సదరు పత్రికా యజమాని కూడా ఈ టెండర్లలో పాల్గొని రైతులకు తక్కువ ధరకే మీటర్లు అందించమని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.

మీటర్లు బిగిస్తే విద్యుత్‌ లో ఓల్టేజ్, హై ఓల్టేజ్‌ సమస్య రాదని, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు, వృథా అరికట్టేందుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో 18 వేల మీటర్లు బిగించామని, దీని ద్వారా  నెలకు 33 శాతం విద్యుత్ ఆదా అయ్యిందని వెల్లడించారు. విద్యుత్ బిల్లును నేరుగా రైతుల అకౌంట్లలోకే వేస్తామని, వారు నేరుగా డిస్కంలకు చెల్లిస్తారని చెప్పారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డిబిటి) కోసం రైతుల సమ్మతితోనే వారి పేరిట అకౌంట్లను కూడా ఓపెన్ చేస్తున్నామని చెప్పారు.

ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 45 వేల ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని, వీటిపై షుమారు 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఆరునెలలకు గానీ కొత్తది వచ్చేది కాదని, కానీ తమ హయాంలో 48 గంటల్లోపు కాలిపోయిన వాటి స్థానంలో  కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లు అందిస్తున్నామని, మనికొన్నింటిని రిజర్వ్‌ లో కూడా పెట్టుకుంటున్నామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Also Read: అటవీ భూముల అన్యాక్రాంతం అవాస్తవం: పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్