వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెర పై మ్యాజిక్ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేసింది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే మొదటి పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
అందమైన మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది అందెవేసిన చేయి. ఇక అది శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రమైతే ఆయన సంగీతం మరింత మాయ చేస్తుంది. అందుకే శ్రీనివాస్ అవసరాల చిత్రాలకు కళ్యాణి మాలిక్ స్వరపరిచే పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే మొదటి పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. మేఘాల్లో తేలిపోతున్నామనే భావన కలిగించే అంత హాయిగా, ఆహ్లదకరంగా ఈ పాట సాగుతోంది. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం.
“కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా” అంటూ ఆయన పాటను ఎంతో అందంగా ప్రారంభించారు. ఆయన కలం నుంచి జాలు వారిన అక్షరాలు ఎంతో అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. “నువ్వు లేని చోట దారి ఆగిందని.. కాలమాగిపోయి నిన్ను వెతికిందని” అంటూ ఇలా పాటలోని ప్రతి వాక్యం మనసుని హత్తుకునేలా ఉంది. ఈ అందమైన పాటను గాయకుడు ఆభాస్ జోషి అంతే అందంగా ఆలపించారు. ఆయన మధుర స్వరం పాటను మరో స్థాయికి తీసుకెళ్ళింది. కళ్యాణి మాలిక్ సంగీతం, లక్ష్మీ భూపాల సాహిత్యం, ఆభాస్ జోషి గాత్రం మూడూ అద్భుతంగా కుదిరి ‘కనుల చాటు మేఘమా’ను మధురమైన పాటగా మలిచాయి. లిరికల్ వీడియో చూస్తుంటే… ఓ పెళ్లి వేడుకలో కథానాయికను చూస్తూ కథానాయకుడు ఆమెతో గడిపిన క్షణాలను, ఆమె మిగిల్చిన జ్ఞాపకాలను తలచుకుంటూ పాడుతున్నట్లుగా ఉంది. వీడియోలో ప్రతి ఫ్రేమ్ హరివిల్లును తలపిస్తోంది. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.