పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాలు, సానుభూతిపరుల నివాసాలలో దేశవ్యాప్తంగా ఎన్.ఐ.ఏ బృందాలు ఈ రోజు మళ్ళీ తనిఖీలు చేపట్టాయి. ఆరు రాష్ట్రాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)లు సంయుక్తంగా దాడులు చేస్తన్నాయి. పీఎఫ్ఐతో లింకులు ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థల కార్యాలయాల్లో కేంద్ర సంస్థలు తనిఖీలు చేస్తున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అసోంలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కేంద్ర నిఘా సంస్థ ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా పాల్గొన్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటకలో పి.ఎఫ్.ఐ తో పాటు దాని అనుబంధ రాజకీయ పార్టీగా కొనసాగుతున్న సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అఫ్ ఇండియా(SDPI) చెందిన మొత్తం 75 మందికి పైగా సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నామని ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. SDPI యద్గిర్ జిల్లా అధ్యక్షుడిని కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు కర్ణాటక అడిషనల్ డిజి అలోక్ కుమార్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) ఉన్నతాధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే, నాసిక్ లలో సుమారు ఎనిమిది మందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అటు మాలెగావ్ లో దాడులు కొనసాగుతున్నాయి.
పీఎఫ్‌ఐ టార్గెట్‌గా గత రెండు వారాల్లో కేంద్ర సంస్థలు దాడులు చేయడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. మొదట ఈ నెల 22న ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు చేసింది. 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు (10), అసోం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి, దిల్లీ (3) రాజస్థాన్ (2)లోనూ పలువురిని అరెస్టు అయ్యారు.
Also Read : పాపులర్ ఫ్రంట్ కు ఉగ్రవాద లింకులు?