Saturday, January 18, 2025
HomeTrending Newsసద్దుల బతుకమ్మ సంబురాలు

సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ,  పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఈ రోజు జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బతుకమ్మతో రాగా ఆయన సతీమణి పుష్ప పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని , అనంతరం బతుకమ్మ సంబరాలలో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జీ.డబ్ల్యు,ఏం.సి మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఇతర నేతలు పాల్గొన్నారు.

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని కార్ హెడ్ క్వార్టర్స్ లో రాచకొండ పోలీసు ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, అడిషనల్ సీపీ సుదీర్ బాబు, మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి, ఎల్ బి నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆడబిడ్డలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని తెలుగులో ఏ ఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

మహబూబాబాద్ లో ఎంపి మాలోత్ కవిత బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మీ వేడుకలకు హాజరయ్యారు.

హైదరాబాద్ అంబర్ పెట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.

హైదరాబాద్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో బతుకమ్మ పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఉద్యోగినులు ఆడిపాడారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఉద్యోగులు నవరాత్రి  పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు.  పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవటం సంతోషంగా ఉందని డోబ్రియల్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్