Thursday, February 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫార్మా కంపెనీల లీలలు

ఫార్మా కంపెనీల లీలలు

ఎద్దు పుండు కాకికి ముద్దు.
మనిషి పుండు ఫార్మాకు ముద్దు.

ఇక్కడ ఫార్మా మాటకు విస్తృతార్థంలో సకల వైద్య విభాగాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ప్రయివేటు పెద్దాసుపత్రిని ఘనంగా ప్రారంభిస్తున్నారనుకోండి. వారేమి కోరుకుంటారు? నిత్యం తమ ఆసుపత్రి రోగులతో కళకళలాడాలని. జనరల్ వార్డు మొదలు ఐ సి యూ వరకు ఒక్క బెడ్డు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోవాలని. దేశ విదేశాలనుండి హెల్త్ టూరిస్టులు విమానాల రెక్కలు తొడుక్కుని తమ ఆసుపత్రికి రావాలని. ఏడాది తిరక్కుండా పండంటి బిడ్డను కన్నట్టు…ఏడాది తిరక్కుండా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తమ ఆసుపత్రి శాఖలు పురుడుపోసుకుని…అందులో కూడా ఖాళీ లేకుండా రోగులు నిండిపోవాలని.

మన కాలనీలో కొత్తగా ఒక మందుల షాపు ప్రారంభమయ్యిందనుకోండి. ఆ షాపు మననుండి ఏమి ఆశిస్తుంది?
మనకు చిన్న పెద్ద రోగాలు వచ్చి…డాక్టర్లు రాసే చేంతాడు లిస్టు ప్రిస్క్రిప్షన్ మందులు టన్నులకు టన్నులు ఆ షాపులోనే కొనాలని. రాత్రి పగలు విరామం లేకుండా రోగాలకు మందులు అమ్ముతూనే ఉండాలని. మూడు నెలలు తిరక్కుండా మిగతా కాలనీల్లో కూడా తమ మందుల షాపు శాఖలు తెరిచి…ఇబ్బడి ముబ్బడిగా మందులు అమ్మాలని.

కొత్తగా ఒక డయాగ్నస్టిక్ కేంద్రం పెట్టారనుకోండి. ఆ కేంద్రం ఏమి ఆశిస్తుంది?
ప్రతి అనుమానం తప్పనిసరిగా పరీక్షకు దారి తీయాలని. డాక్టర్లు రోగులను తమ పరీక్ష కేంద్రానికే రెఫర్ చేయాలని. చిత్ర విచిత్ర రోగాలకు పరీక్షలు చేసే కేంద్రంగా తమకు పేరు రావాలని. నిద్ర పట్టక తల నొప్పితో వెళితే…తలకు ఎం ఆర్ ఐ పరీక్ష తప్పనిసరి కావాలని.

ఒక ఫార్మా కంపెనీలో ఒక ఆసామి ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాడనుకోండి. ఆయనేమి కోరుకుంటాడు?
జనం రోగాలతో విలవిలలాడుతూ…తమ ఫార్మా కంపెనీ మందే శరణ్యమని ఎగబడి వాడాలని. డాక్టర్లు తమ మందునే ప్రిస్క్రైబ్ చేయాలని. ఒక మహమ్మారి సీజన్ లోనే తన వెయ్యి కోట్లు పది వేల కోట్ల లాభంగా మారిపోవాలని. ప్రభుత్వాలు తమ ఫార్మా ఫ్యాక్టరీ గేట్ల దగ్గర పడిగాపులు పడాలని. వివిధ దేశాల రాష్ట్రపతులు, ప్రధానులు తమ మందుకోసం ప్రాధేయపడాలని. తమ మందు లేకపోతే లోకం మాడి మసై పోతుందన్న క్లారిటీ కలగాలని

ఈమధ్య ఒక మిత్రుడి కొడుకు పెళ్లికి వెళ్లాను. కొందరు అతిథులను రిసీవ్ చేసుకుని వారిని ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. టిఫిన్ చేస్తూ ఒక మిత్ర బృందంతో పిచ్చాపాటి మాటలు మొదలయ్యాయి. రెండు దశాబ్దాలుగా అమెరికాలో వ్యాపారంలో బాగా రాణిస్తున్న ఒక మిత్రుడు సరదాగా ఒక మాటన్నాడు.
ఫలానా అమెరికా ఫార్మా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ పాతిక లక్షల కోట్లు అయ్యేదాకా కరోనా పోదండీ. ప్రతి వైరస్ కు కొన్ని టార్గెట్లు ఉంటాయి. లేదా ప్రతి టార్గెట్ కు కొన్ని వైరస్ లు పుడతాయి. ఫార్మా కంపెనీలు ఆ టార్గెట్లు రీచ్ కాగానే మంత్రించినట్లు కరోనా వెళ్లిపోతుంది. ఇదంతా గ్లోబల్ ఫార్మా గ్యాంబ్లింగ్!

మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు సహిత ఉప్పొంగలి మీద నెయ్యి వేసుకుని తింటున్న నాకు మొదట నోట్లో మాట రాలేదు. తరువాత తేరుకుని…ఆ బృందంతో వాదించడం మొదలు పెట్టా. ఈలోపు స్మార్ట్ ఫోన్లో కొన్ని అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు కరోనా ఒక్క సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్లకు పెరిగాయో వివరించే అంకెలను ఆయా కంపెనీల వెబ్ సైట్ వివరాల ఆధారంగానే చూపించాడు.

అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు అనగానే ఫ్రైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటివి మాత్రమే అనుకునేరు. మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అయిదారు తెలుగు ఫార్మా కంపెనీలు కూడా అంతర్జాతీయ పద్దులో ఉన్నవే.

కరోనా భయానికి మనం ఎక్కించుకున్నది వ్యాక్సినో? డిస్టిల్డ్ వాటరో? పెరుమాళ్లకే ఎరుక అని…సాంబారులో వడ ముంచుకుంటూ వ్యాక్సిన్ వేదాంతం చెప్పాడు మరో పారిశ్రామికవేత్త. వీరందరూ బాగా చదువుకుని…ప్రపంచం మొత్తం తిరిగినవారు. ఏ విషయమయినా ఎక్కువ తెలిస్తే విలువ పోతుంది. “అతి పరిచయాత్ అనర్థం” అన్న హితవాక్కు అందుకే పుట్టి ఉంటుంది.

ఇది ఫార్మా కంపెనీల మాయోపాయాల మీద చర్చ కాదు. ఆ కంపెనీలను దగ్గరగా చూస్తున్నవారి ఒక అభిప్రాయం


హైదరాబాద్ లో ఒక పెద్ద ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. లెక్క చూపని నగదు దాదాపు 150 కోట్లు ఇప్పటికి పట్టుకున్నామని, మొత్తం లెక్కలు నాలుగు నెలలు లెక్కకడితేగానీ క్లారిటీ రాదన్నది ఆ ప్రకటనలో సారాంశం. లెక్కా పత్రం లేకుండా దాచుకున్న డబ్బు అయిదు వందల కోట్లు దాటి ఉంటుందని ఒక అంచనా. బీరువాల్లో నోట్ల కట్టలు కట్టలు దాచుకున్న ఫోటోను కూడా ఐ టీ డిపార్ట్ మెంట్ విడుదల చేసింది.

ఆ ఫొటోలతో సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటోంది. ఆ ఫొటోకు ఒక కామెంట్ ఇది:-

“రెమిడిసివర్ పేరుతో పేదల నుంచి పీల్చిన రక్తం అంతా ఇలా నోట్ల కట్టల్లో గూట్లోకి చేరింది”

జనానికి అన్నీ అర్థమవుతాయి.
కానీ- ఏమీ చేయలేరు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్