వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో నైజీరియాలా మారుతుందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని… వ్యవసాయం సహా వృత్తులు, వ్యాపారాలు సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఓపెన్ బారోయింగ్స్ 130% పైగా పెరిగాయని, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.4 లక్షల కోట్ల వరకు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం ప్రకారం అప్పులు జి.ఎస్.డి.పిలో 35% మించకూడదని, కానీ అప్పుల్ని బడ్జెట్ లో చూపించకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2021 మార్చి నాటికి చేసిన ఏపీ చేసిన అప్పులు 44.04శాతంపైగా ఉన్నాయని, అప్పులు చెల్లించడానికి అప్పులు చేసే స్థితికి ఏపీ దిగజారిందని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏపీలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు.
తమ ప్రభుత్వ హయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పెట్టుబడుల ఆకర్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని, డ్వాక్రా వ్యవస్థ పటిష్టపరచి మహిళా స్వయం సమృద్ధికి పునాదులు వేశామని యనమల పేర్కొన్నారు. ఆదాయం, సంపద పెంచుకోవడం మాని అప్పులు, ఆస్తుల అమ్మకం ప్రమాదకరమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.