స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను కొట్టి వేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది.
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది లతో కూడిన ధర్మాసనం నేడు దీనిపై విచారణ మొదలు పెట్టింది. బాబు తరఫున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వి, సిద్దార్థ్ అగర్వాల్ లు …. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహాత్గీ తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా 17 (ఏ) పైనే వాదనలు కొనసాగాయి.
చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని లూథ్రా కోరగా, బెయిల్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ అడుగుతున్నారని ముకుల్ వ్యాఖ్యానించారు.
17 (ఏ)కు సంబంధించి ఏపీ హైకోర్టుకు అందించిన సమాచారాన్ని తమకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించి తదుపరి విచారణను వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది.
2021 డిసెంబర్ 9న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని, బాబు పేరు దీనిలో చేర్చడం 17(ఏ)కు విరుద్ధమని, అందులోనూ 2015-19 వరకూ ఈ లావాదేవీలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఏడాది తరువాత 2021 లో కేసు నమోదు చేశారని సింఘ్వి వాదించారు. కేసు మెరిట్స్ వద్దని, కేవలం 17(ఏ) పైనే వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరారు.