Mother Tongue Must: తెలుగువారికి తెలుగు భాషాభిమానం ఉండాల్సినంత ఉందా? లేదా? ఉంటే…ఎంత ఉంది? ఉండకపోతే…వచ్చే నష్టాలేమిటి? అన్నది ఎడతెగని చర్చ.
ఇంగ్లీషు అవసరం కాదనలేనిది. పొరుగున తమిళనాడు, కర్ణాటకల్లో తమిళ, కన్నడలతో పాటు ఇంగ్లీషు వృద్ధి పొందుతూ ఉంటుంది. తెలుగు నేలల్లో ఎందుకోగానీ ఇంగ్లీషు విత్తనాలే మొలకెత్తుతాయి. తెలుగు గింజలు ఎంత గింజుకున్నా…ఎంత పొటాషియం, నైట్రేట్ యురియాలు చల్లినా…ఎల్ కె జీ దగ్గరే విత్తనాలు మొలకెత్తక…ఇంగ్లీషు హైబ్రిడ్ వంగడాలు వాటంతట అవే వచ్చి…మొలకెత్తి…మహా వృక్షాలవుతాయి.
మాట్లాడే భాష, రాసే భాష మాతృ భాష కానప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి భాషాశాస్త్రవేత్తలు ఏమేమి చెప్పారు అన్నది ఇక్కడ అనవసరం. తమిళనాడు, కర్ణాటకల్లో మాతృభాష పరిరక్షణకు సంబంధించి ఇటీవలి పరిణామాలను ఒకసారి గమనిద్దాం.
తమిళ సంతకం
తమిళనాడులో ఇకపై విద్యార్థులందరూ తమిళంలోనే సంతకం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీసం ఇంటిపేరు(ఇనిషియల్) తమిళ అక్షరమే ఉండేలా అలవాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదాహరణకు ఎం కె స్టాలిన్ అన్న పేరులో మొత్తం ఇంగ్లీషు లిపిలో కాకుండా తమిళ లిపిలో రాస్తే సంతోషం. హీనపక్షం…ఎం కె అన్న ఇంటిపేరును సూచించే అక్షరాలనయినా విధిగా తమిళ అక్షరాల్లోనే రాయాలని ఆదేశించారు.
ఇంటిపేరును సూచించే ఇంగ్లీషు పొడి సంకేతాక్షరాలను తమిళంలో రాయడం వల్ల వెంటనే తమిళ భాషా వికాసానికి జరిగే ప్రయోజనాలు పైకి కనిపించకపోవచ్చు. భావానికి భాష అనువాదం. భాషకు శబ్దం/అక్షరమే ప్రధానం. అక్షరం పలికితే శబ్దం. రాస్తే లిపి. శబ్దం గాల్లో కలిసి నామరూపాలు లేకుండా అదృశ్యం కావచ్చు. లిపిలో ఉన్న అక్షరం శాశ్వతం.
ఇంగ్లీషు ఇల్లలుకుతూ ఇంటిపేరు మరచిపోయిన ఈగలు, దోమలు కాకుండా…తమిళ అక్షరంతో ఇంటిపేరును గుర్తుంచుకోవడంలో తమిళుల భాషాభిమానాన్ని ఇతరులెవరయినా నేర్చుకోవచ్చు. తమిళులను ప్రశంసించవచ్చు.
కన్నడ చదువు
కర్ణాటకలో ఇకపై కన్నడ చదవడం, రాయడం రానివారికి రాష్ట్రప్రభుత్వ నియామకాల్లో అవకాశం లేకుండా కొత్త చట్టం చేశారు. అలాగే ఇకపై కర్ణాటకలో కనీసం పదిహేనేళ్లు చదివినవారే స్థానికులు, మిగతావారిని స్థానికేతరులుగా పరిగణిస్తారట. కన్నడ భాషా పరిరక్షణ-2022 చట్టం ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులందరూ పదో తరగతి దాకా విధిగా కన్నడ భాషను చదవాలి. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఉద్యోగులు కన్నడను వాడకపోతే అపరాధ రుసుము వసూలు చేస్తారు.
డోంట్ వర్రీ. యాక్చువల్లీ…టెల్గూ ఈజ్ ఏ గ్రేట్ లాంగ్వేజ్. ఇట్ విల్ సర్వైవ్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఎవర్!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :