రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ది పరచటం, అడవుల్లో మనుషులు, పెంపుడు జంతువుల ద్వారా తలెత్తే సమస్యలను (Biotic Disturbance) తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి అన్నారు. కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు పురోగతి, హరితవనాల్లో వందశాతం మొక్కలు నాటడం, అర్బన్ పార్కుల అభివృద్దిపై పీసీసీఎఫ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో అరణ్యభవన్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రెండు గ్రామాల (రాంపూర్, మైసంపేట) పునరావాసం ఒక మోడల్ గా ఉండాలని, మిగతా శాఖలతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని పనులు పూర్తిచేయాలన్నారు. అన్ని హరితవనాల్లో వందశాతం (సాచురేషన్ బేసిస్ లో) చిక్కటి పచ్చదనం పెంచేలా పెద్ద మొక్కలు నాటాలన్నారు. కోటీ ఎనభై లక్షల మొక్కలు నాటడం లక్ష్యంకాగా ఇప్పటిదాకా సుమారు కోటి మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఎనభై లక్షల మొక్కలను వచ్చే ప్లాంటేషన్ సీజన్ లో దశలవారీగా పూర్తి చేయాలని స్పెషల్ సీఎస్ సూచించారు. హరితనిధి నిధుల ద్వారా అభివృద్ది చేస్తున్న సెంట్రల్ నర్సరీల పురోగతిపైనా సమావేశంలో చర్చించారు. వచ్చే సీజన్ కల్లా అన్ని నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని ఆదేశించారు.
అర్బన్ ఫారెస్ట్ పార్కులకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయని, మొత్తం 109 పార్కుల్లో 55 పూర్తికాగా, మరో 54 వివిధ దశల్లో ఉన్నాయని శాంతి కుమారి తెలిపారు. పూర్తయిన ఫారెస్ట్ పార్కులను ప్రజల ఆరోగ్య సందర్శనకు, విద్యార్థులకు పర్యావరణ జ్ఞానం
పెరిగేలా జిల్లా అటవీ అధికారులు, సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశానికి అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, డీసీఎఫ్ శాంతారామ్, ఓఎస్డీ శంకరన్, కన్సల్టెంట్ శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు.