త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 20 నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఉదయం 7 గంటలకే షూటింగ్ వస్తున్నారంటే.. ఈ మూవీని ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన తర్వాత వేరే సినిమాకు రైటర్ గా వర్క్ చేయడం లేదు. తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఇప్పుడు మరోసారి పవన్ కోసం పెన్ను చేసుకోక తప్పడం లేదు. పవన్ కళ్యాణ్.. సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ‘వినోదయ సీతమ్’కి ఇది రీమేక్. ఈ సినిమాకి మాటల రచయితగా బుర్రా సాయిమాధవ్‌ని ఎంచుకొన్నారు. అయితే స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్‌దే. రీమేక్ కథని పవన్ శైలికి అనుగుణంగా కొన్ని కీలకమైన మార్పులు చేశాడు త్రివిక్రమ్.
అయితే… ఏమైందో ఏమో కానీ.. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాయాలి. ఆ బాధ్యతను ఇప్పుడు త్రివిక్రమ్ తీసుకున్నారని తెలిసింది. ఓ వైపు మహేష్ బాబుతో సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ.. మరో వైపు పవన్ కళ్యాణ్ మూవీ కోసం డైలాగ్స్ రాస్తుండడం విశేషం. నిజానికి బుర్రా సాయిమాధవ్ స్థానంలో మరో రచయితని తీసుకోవాలి అనుకొన్నారు. కానీ… పవన్ మాత్రం త్రివిక్రమ్ రాస్తేనే బాగుంటుంది అన్నారట. దీంతో త్రివిక్రమ్‌కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. మరి.. త్రివిక్రమ్ మహేష్, పవన్ సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తారో.. ఎలాంటి విజయాల్ని అందిస్తారో..?
Also Read: ధనుశ్ ఓ కర్మ యోగి: త్రివిక్రమ్