Share to Facebook Share to Twitter share to whatapp share to telegram
Miyazaki Mangoes

పండు పండు పండు …ఎర్ర పండు అంటూ సూర్యుణ్ణి చూసి ఎగిరెగిరి ముద్దాడిన హనుమ మన ఆరాధ్య దైవం. సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణుడు స్పృహలోకొచ్చేలా చేసాడని చెప్తుంటే ఆనందంతో భక్తితో పులకించి పోతాం. అన్ని యోజనాల దూరాన్ని అవలీలగా దాటి అవరోధాల్ని అలవోకగా అధిగమించిన అంజనీ సుతుడి లీలల్ని ఎంతగానో తలచుకుంటాం. ఇష్టమైన దానికోసం ఎంత కష్టపడి అయినా సాధించాలి.

వేసవికి ప్రకృతి సిద్ధమయిన బంధువులు సువాసనల మల్లె, నోరూరించే మామిడి పండు. పళ్లలో రారాజు మామిడి. మామిడిపండు తిననివారు మానై పుట్టున్ అని అభిమానుల ఉవాచ.

పచ్చని ఆకుల నుంచి పూత కట్టి పిందెలు కాయలు, పళ్ళ వరకు ఎన్ని అందిస్తుందో! అందుకే మామిడి రాకకోసం ఆవురావురంటూ ఎదురుచూస్తూ ఉంటారు. మామిడి కాయ కోసి ముక్కల్లో ఉప్పు కారం నంజుకుని తినని బాల్యం బాల్యమే కాదు.

మామిడి కాయ-కొబ్బరి చట్నీ, మామిడి-ఉల్లిపాయ చట్నీ రుచి చూడని జిహ్వ జిహ్వే కాదు. మామిడి పండు తనివి తీరా తినని బతుకు బతుకే కాదు. ముక్కలుగా తినాలి. పండు పండును ఆసాంతం జుర్రుకుని తినాలి. మామిడి చెరుకు రసాలను పీల్చి పీల్చి తాగాలి. మళ్లీ వేసవి దాకా దొరకని మామిడిని తమకంతో తినాలి. తదేకంగా తినాలి. ధ్యానంగా తినాలి. బతికి ఉన్నందుకు మామిడి తినాలి. పోయేదాకా మామిడి తింటూనే ఉండాలి.

దుస్తులు, నగల డిజైన్ల లో కూడా మామిడి ప్రభావం ఉందంటే మన సంస్కృతిలో మామిడి ఎంతగా కలిసిపోయిందో అర్థమవుతుంది.

నాలుగువేల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న మామిడి ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రముఖ దేవాలయాల్లో మామిడిపళ్ళతో ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి చేతిలో మామిడిపండు ఉంటుంది.

చుక్కల్లో ‘ధర’

మామిడి పళ్లలో ఎన్నో రకాలు. మరెన్నో ధరలు. పది, వంద పెట్టి కొనడం తెలుసు. కానీ ఒక్కో పండు 21 వేలు పలికే వెరైటీ గురించి ఎప్పుడైనా విన్నామా? పైగా ఏడు మామిడి పళ్లకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ పెట్టాడట ఆ తోట యజమాని. మియాజాకీ వెరైటీగా పిలిచే ఈ పళ్ళు జపాన్లో ఎక్కువ దొరుకుతాయి.

రంగు, రుచి, రూపం, సుగుణాలు అన్నీ అధికమే ఈ పండులో. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే పండే ఈ మధుర ఫలం మన దేశంలో జబల్పూర్లో పండించడం విశేషం అయితే, దీని యజమాని సంకల్ప్ పరిహార్ ఈసారి తోటకి పటిష్టమైన భద్రత కల్పించాడు. సంకల్ప్ దంపతులకు రైల్లో పరిచయమైన వ్యక్తి రెండు మొక్కలు ఇచ్చి బాగా చూసుకోమన్నాడుట. ఆ మాటల కర్థం ఇప్పుడు బోధపడింది. కిందటి ఏడాది పళ్ళు దొంగిలించారట. అందుకని రెండు చెట్లకు జాగిలాలతో కూడిన కాపలా పెట్టాడు.

ముదురు ఎరుపురంగులో మిసమిసలాడే మియాజాకీ ఇక్కడ దామిని పేరుతో పెరుగుతోంది. కాపుకొచ్చే ఏడు పళ్ళను మొక్కలుగా మార్చాలని సంకల్ప్ సంకల్పం. ఈ సంకల్పం దేశమంతా విస్తరించి మనదాకా రావాలని ఆశపడదాం. అంతవరకూ అవి అందని మామిడి పళ్లే!

-కె. శోభశ్రీ

Also Read : రైతులకు నష్టం రాకుండా చర్యలు : కన్నబాబు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com