తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారం చేపట్టి నేటికి (జనవరి 9) నలభై వసంతాలు పూర్తయ్యాయి. 1983న ఇదే రోజున టిడిపి వ్యవస్థాపకుడు, సినీ నటులు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల్లో తమ స్పందన తెలియజేశారు.
“తెలుగు గడ్డపై కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు…తెలుగు వెలుగులు విరజిమ్మిన రోజు… ప్రజలకు సంక్షేమం-అభివృద్ధి పరిచయం అయిన రోజు… బడుగులకు రాజ్యాధికారం దక్కిన రోజు…. ప్రతి తెలుగువాడు గర్వించిన రోజు… అదే, 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం తొలి ప్రభుత్వం ఏర్పడిన ఈరోజు” అంటూ బాబు ట్వీట్ చేయగా…
“తెలుగుజాతి ఆత్మ గౌరవ పతాకాన్ని తెలుగుతేజం నందమూరి తారకరామారావు గారు సగర్వంగా ఎగురవేసిన రోజు తెలుగుదేశానికి పర్వదినం. అణగారినవర్గాల అభ్యున్నతి, తెలుగుజాతి ఆత్మాభిమానం పరిరక్షణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9 రోజు నిజమైన పండగరోజు. ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, సంపాదించిన కీర్తి, చూపిన స్ఫూర్తి తెలుగుదేశం బలం. తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం ఉంటుంది. జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్” అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.