గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఈజిప్టు ప్రధాని అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు, పలువురు కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
స్మారక చిహ్నం వద్ద త్రివిధ దళాల అధిపతులు, ప్రధాని, రాజ్‌నాథ్‌సింగ్‌లు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి 6 వేల మంది సైనికులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 150 సిసిటివి కెమెరాల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. ముందుగా బ్యాండ్ కవాతులో ఈజిప్టు సాయుధ దళాల కవాతు కూడా పాల్గొంది. ఈజిప్టు సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహించే బృందంలో 144 మంది భారత సైనికులు కూడా ఉన్నారు.
ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేసింది. మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ అయిన ‘ప్రభల తీర్థం’ను వర్ణించే ఏపీ శకటం అందరిని ఆకట్టుకుంది. ఎర్రకోట వరకు సాగిన త్రివిద దళాల సైనిక కవాతులు, కేంద్ర, రాష్ట్ర శకటాల ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా 17 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. దక్షిణ భారత దేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం దక్కగా తెలంగాణ శకటమేది ఎంపిక కాలేదు. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభల తీర్థం సంస్కృతితో ఏపీ శకటాన్ని తీర్చి దిద్దారు. ప్రభల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంపై కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం గంగకులకూరు అగ్రహారం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. 500 ఏళ్ల క్రితం నుంచి ఈ సంస్కృతి ఉందని, 400 ఏళ్లుగా ఒక పద్ధతిలో కొనసాగుతూ వస్తోందని చెప్పారు. కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో కనుమ నాడు ప్రభల తీర్థం వేడుక జరుగుతుంది. ఏకాదశ రుద్రులను ఒక చోట చేర్చడమే ప్రభల తీర్థం పరమార్థమని ప్రతీతి.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి, వివిధ మంత్రిత్వ శాఖల నుండి ఆరు శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో 479 మంది కళాకారులచే ‘వందే భారతం’ నృత్యపోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ నృత్యపోటీ జరగడం వరుసగా రెండోసారి కావడం విశేషం. డేర్ అండ్ డెవిల్స్ మోటార్ సైకిల్ బృందం కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఆకట్టుకుంది. త్రివిధ దళాలకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో కనువిందు చేశాయి.