Manjira: నిన్న అసెంబ్లీలో చిడతలు వాయించిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు కౌన్సిల్ లో అదే పని చేశారు. కల్తీ సారా పై చర్చ జరపాలంటూ నినాదాలు చేయడంతో పాటు, చిడతలు వాయించడం, విజిల్స్ వేయడం లాంటి చర్యలకు దిగారు. కౌన్సిల్ చైర్మన్ మోషెన్ రాజు ఎంతగా వారించినప్పటికీ టిడిపి సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిడతలు వాయిస్తున్న టిడిపి సభ్యులపై వైఎస్సార్సీపీ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు విసిరారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి సభ్యులు దువ్వాడపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మంత్రి కురసాల కన్నబాబు టిడిపికి చెందిన 8 మంది సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మండలి చైర్మన్ ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. బచ్చుల అర్జునుడు, దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు, కేఈ ప్రభాకర్, అంగర రామ్మోహన్, బిటెక్ రవి, రాజ నర్సింహులు, దువ్వాడ రామారావు లను ఒకరోజు పాటు సభనుంచి సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో చిడతలు: స్పీకర్ ఆగ్రహం