Saturday, November 23, 2024
HomeTrending NewsUttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి పలువురి గల్లంతు

Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి పలువురి గల్లంతు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకెళ్లడంతో అక్కడ కొన్ని షాపులు నేలమట్టమయ్యాయి. దుకాణ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరికొంత మంది గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు.

ఘటనతో జాతీయ విపత్తు దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు కొండలపై నుంచి జారి పడుతున్న బండరాళ్ల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కొందరు పర్యాటకులు తప్పిపోయినట్లు వెల్లడించారు.

గల్లంతైన వారు వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28), అమర్ బోహ్రా, అనితా బోహ్రా, రాధిక బోహ్రా, పింకీ బోహ్రా, పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3)గా గుర్తించినట్లు తెలిపారు. గత రాత్రి నుంచి గౌరీకుండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం ఈ ప్రమాదానికి దారితీసింది. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ విశాఖ తెలిపారు.

మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పౌరీ, టెహ్రీ, రుద్రప్రయాగ్ , డెహ్రాడూన్ లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చమోలి, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్