మంత్రి పెద్దిరెడ్డి అంతుచూస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. నేడు పుంగనూరు వద్ద టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. మొన్న పులివెందులలో పొలికేక వినిపించానని, నేడు పుంగనూరు లో గర్జిస్తున్నానని, మరోసారి ఇక్కడకు వస్తానని ప్రకటించారు. మీరు కర్రతో వస్తే తాను కర్రతోనే వస్తానని, మీరు యుద్ధం చేస్తానంటే తానూ సిద్ధమని సవాల్ చేశారు.
టిడిపి కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, నేడు జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని బాబు డిమాండ్ చేశారు. తాను ఇక్కడ తిరగ కూడదా అంటూ ప్రశ్నించారు. పుంగనూరు పుడింగి సంగతేంటో చూస్తానని పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. నేడు జరిగిన ఘటనకు పెద్దిరెడ్డి, పోలీసులే కారణమని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఇక్కడ తన కార్యక్రమం లేదని పూతలపట్టులో ఉందని, అంగళ్లు, పుంగనూరు మీదుగా వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజాస్వామ్యం కాపాడటానికి పోరాడుతుంటే, వారు తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని, అధికార పార్టీకి దాసోహం కావోద్దని పోలీసులకు సూచించారు.
బాబు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నేడు పూతలపట్టులో జరగబోయే రోడ్ షో కు హాజరయ్యేందుకు బయల్దేరారు. అయితే పుంగనూరు బైపాస్ లో భారీగా పోలీసులు మొహరించి టిడిపి కార్యకర్తలు పట్టణంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతకుముందు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్ళ వద్ద కూడా వైసీపీ-టిడిపి కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడులపై బాబు తీవ్రంగా స్పందించారు.