Mini Review: ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన సినిమాలలో ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ ఒకటి. చిన్న సినిమా .. కొత్త హీరోహీరోయిన్లు. అయినా లవ్ స్టోరీకి సంబంధించిన కథ కావడంతో, యూత్ కాస్త ఇంట్రెస్ట్ ను చూపించిన సినిమానే ఇది. ఇక ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాలో ఎంత గొప్ప కంటెంట్ ఉందనేదది అంచనా వేయలేని పరిస్థితి. అందువలన కుర్రాళ్లు థియేటర్ల వైపు ఒక అడుగు వేస్తున్నారు. పెట్ల కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకి, రాజేశ్ దొండపాటి దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాకి సంబంధించిన టీమ్ లో ఎక్కువ మంది కొత్త వాళ్లు గానే చెప్పుకోవాలి. వాళ్లంతా కలిసి ఒక మంచి సినిమా చేయాలనే కష్టపడి ఉంటారు. అయితే ఆ దిశగా వాళ్లు చేసిన ప్రయత్నాలు ఆడియన్స్ ను మెప్పించే స్థాయిలో లేకపోవడమే అసలు సమస్య. ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు, ఆ పాత్రను డిజైన్ చేసే తీరే ఒక రేంజ్ లో ఉండాలి. లేదంటే ముందుగా టైటిల్ విషయంలో ప్రేక్షకుడు డిజప్పాయింట్ అవుతాడు. టైటిలే కదా కాసేపు పక్కన పెట్టేద్దామని అనుకోడు .. ఎందుకంటే అది చూసే అతను థియేటర్ కి వచ్చాడాయే.
ఇక ఈ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం ఉంటుంది .. మధ్యలో ఎన్ని పాత్రలు వచ్చి ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగించినా హీరో ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలి. ఇక లక్ష్యంతో పాటు ఆ ఏజ్ లో లవ్ స్టోరీ ఉండటం కూడా కామన్ కనుక, ఆ ప్రేమను గమ్యం దిశగా తీసుకుని వెళ్లాలి. ఈ రెండు పడవలపై కాళ్లేసి ఒకే తీరానికి చేరుకోవాలి. కానీ టైటిల్ కి దూరంగా హీరో పాత్రను డిజైన్ చేయడం .. తన లక్ష్యం గురించి తానే మరిచిపోయినట్టుగా కనిపించడం అసంతృప్తిని కలిగిస్తాయి. కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రల తీరుతెన్నులపై కాస్త గట్టిగా కసరత్తు చేసి ఉంటే, కృష్ణగాడు ఒక రేంజ్ వరకూ వెళ్లగలిగేవాడేమో.