Friday, September 20, 2024
HomeTrending NewsNO Confidence: అవిశ్వాసంపై మాటల తూటాలు...

NO Confidence: అవిశ్వాసంపై మాటల తూటాలు…

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఆరోపణలు… విపక్షాల స్నేహం అనైతికమిందని అధికార పక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో మొదటి రోజు చర్చలో భాగంగా మాటల తూటాలు పేలాయి. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతిపక్ష ఎంపీలు ఎండగట్టారు. మణిపూర్‌పై ప్రధాని మోదీ మౌనవ్రతం పాటిస్తున్నారని, మూడు నెలలుగా రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకిపోతుంటే, ఆయన నోరు ఎందుకు పెగలడం లేదని దుయ్యబట్టారు. మణిపూర్‌ అల్లర్లపై మోదీ నోరు తెరిపించడంతో పాటు రాష్ర్టానికి న్యాయం కోసం అవిశ్వాసం పెట్టినట్టు పేర్కొన్నాయి. కాగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ రోజు (బుధవారం) కూడా కొనసాగనున్నది. రేపు (గురువారం) ప్రధాని మోదీ సమాధానంతో పాటు ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

విభజించు-పాలించు కుట్రలు
అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్‌ అల్లర్లపై కేంద్రానికి వరుస ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ ఎందుకు పర్యటించలేదని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండపై నోరు విప్పేందుకు ఆయన 80 రోజుల సమయం ఎందుకు తీసుకొన్నారని, మణిపూర్‌ సీఎంగా బీరేన్‌సింగ్‌ ఎందుకు తొలగించలేదని సూటిగా ప్రశ్నించారు. ‘వన్‌ ఇండియా’ అంటూ మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం.. మణిపూర్‌ను రెండుగా(లోయ, కొండ ప్రాంతాల్లో నివసించే మైతీలు, కుకీలు) విభజించిందని దుయ్యబట్టారు.

బీరేన్‌ రాజీనామా చేయాలి
మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయాలని చర్చలో భాగంగా విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. టీఎంసీ ఎంపీ సౌగతారాయ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలు సిగ్గుచేటు అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఇలాంటి అమానుష ఘటనలను మీరు అనుమతిస్తారా? దేశ మహిళలను అవమానిస్తారా? ఈ ప్రభుత్వానికి మీరు ఎలా మద్దతు పలుకుతున్నారో మీ మనసాక్షిని అడగండి’ అని ఎన్డీయే కూటమి ఎంపీలకు హితవు పలికారు.

ప్రపంచ నేతపై అవిశ్వాసమా?
కాగా, ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టడాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు. తప్పుడు సమయంలో, తప్పుడు పద్ధతిలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రపంచ నేతగా ఎదుగుతున్న సమయంలో ఇటువంటి తీర్మానం తీసుకురావడం సరికాదని చెప్పుకొచ్చారు. అవిశ్వాసం ద్వారా ప్రతిపక్షాలు ‘పేదల బిడ్డ’ను లక్ష్యంగా చేసుకొన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్