అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు తెలిపారు. బైడెన్‌తోపాటు కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్‌కి డబ్బు చెల్లించారనే ఆరోపణలపై అభియోగాలు మోపిన మాన్‌మట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్‌లను చంపుతానని యూటా రాష్ట్రానికి చెందిన క్రెయిగ్ రాబర్ట్‌సన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఎఫ్‌బీఐ అధికారులు రాబర్ట్‌సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడని అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఎఫ్‌బీఐ ఇంకా పూర్తివివరాలు వెళ్లడించలేదు.