దేశవ్యాప్తంగా కమల్ – రజనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ ఇద్దరినీ కూడా కేవలం తమిళ హీరోలుగా ఎవరూ భావించరు. అందుకు కారణం వాళ్లు తమ కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చిన తీరు .. అందుకున్న విజయాలు .. పొందిన ఆదరాభిమానాలే. తమిళంలో ఈ ఇద్దరి ముందు హీరోలు ఉన్నారు .. ఆ తరువాత కూడా చాలామంది వచ్చారు. కానీ తమిళ సినిమాను ఈ ఇద్దరూ ఎక్కువగా ప్రభావితం చేశారు .. ప్రపంచపటానికి తమిళ సినిమాను పరిచయం చేశారు. అందువలన వాళ్లిద్దరి ప్రత్యేక స్థానం ఇప్పుడే కాదు .. ఎప్పటికీ ఉంటుంది.
తమిళనాట రజనీ .. కమల్ కి ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. రజనీ స్టైల్ తనని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుందని చెప్పడానికి కమల్ .. ఆయనను చూసి నటన పట్ల ఎక్కువగా దృష్టి పెట్టానని చెప్పడానికి రజనీ వెనకాడకపోవడం విశేషం. ఇక ఈ ఇద్దరూ కూడా యువ దర్శకులకు అవకాశాలనిస్తూ వెళుతూ ఉండటం మరో విశేషం. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఇక రజనీ ఏ విషయంలోను జోక్యం చేసుకోరు. కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వంలో మంచి అనుభవం ఉన్న కమల్ కూడా అదే విధంగా వ్యవహరించడం ఆశ్చర్యం.
అలాంటి కమల్ ఆ మధ్య ‘విక్రమ్’ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అరడజను సినిమాలలోపు చేసిన లోకేశ్ కనగరాజ్ కి ఆయన ఛాన్స్ ఇచ్చారు. తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను చూశారు. అలాగే రజనీ కూడా అరడజను సినిమాలకి తక్కువగా చేసిన నెల్సన్ కి ‘జైలర్’ సినిమాతో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఇంతకాలమైనా తమ ఛరిష్మా ఎంతమాత్రం తగ్గలేదనిఈ ఇద్దరూ నిరూపిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల కెరియర్లో ఇంత స్నేహంగా ఉంటూ .. ఇప్పటికీ ఒకరిని మించిన విజయాలను ఒకరు అందుకుంటూ దూసుకెళుతున్న ఇలాంటి హీరోలను ఇకపై చూడటం కష్టమేనేమో.