గన్నవరం టిడిపికి కంచుకోట అని.. ఈ నియోజకవర్గానికి పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన రావు లాంటి గొప్పవాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారని, కానీ తాము చేసిన ఓ తప్పు వల్ల ఓ పిల్ల సైకో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారని, భవిష్యత్తులో అలాంటి తప్పు చేయబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తనవద్దకు వచ్చి చేతులు కట్టుకొని నిల్చునేవాడని… సార్, సార్ అంటూ మాట్లాడేవాడని వల్లభనేని వంశీపై మండిపడ్డారు. మూడుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు.
మరో తొమ్మిదినెలల్లో అధికారంలోకి వస్తామని, ఆ తరువాత గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తామని హెచ్చరించారు. పేకాట క్లబ్ లు, గుట్కా తప్ప దేనిపైనా అవగాహన లేదని, సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడని… రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని తన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించాడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయంలో రాముడి తల నరికితే నవ్విన వ్యక్తి దేవాదాయ మంత్రిగా ఉన్నాడని వేల్లంపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “మాడిపోయిన పల్లీ వెల్లంపల్లి… పనికిమాలిన పేర్ని, ఒక్క ఇల్లు కట్టలేని జోకర్ జోగి’ మంత్రులు… మాజీ మంత్రులను అభివర్ణించారు.
2012 లో కొడాలి, 2019లో వంశీ ఇద్దరూ వెళ్లిపోయిన తరువాత జిల్లాలో పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయిన్దన్నారు. పిల్ల సైకో వంశీకి భయం పరిచయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని, సినిమాలో చూపించినట్లు నిజమైన గా షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో వైఎస్సర్సీపీకి 14 సీట్లు గెలిపిస్తే ఈ జిల్లాకు జగన్ ఏం చేశాడో ఆలోచించాలని, చిప్ప చేతిలో పెట్టారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- చింతలపూడి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని
- జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందిస్తామని…
- పిట్టలవారిగూడెం పూర్తి చేస్తామని
- సుబాబుల్, మామిడి పట్టి, మిర్చి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తామని
- వాటర్ గ్రిడ్ ద్వారా స్వచ్చమైన తాగునీరు ప్రతి ఇంటికీ అందిస్తామని
- పెడనలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటామని ..
- నిలిచిపోయిన బందరు పోర్టు పనులను పూర్తి చేస్తామని,
- కృష్ణా డెల్టా చివరి ఆయకట్టు వరకూ సాగునీరు ఇస్తామని
- విజయవాడలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని
- ప్రజా రాజధాని అమరావతిలో మేజర్ పనులను కూడా తొలి మూడేళ్ళలో పూర్తి చేస్తామని లోకేష్ హామీలు గుప్పించారు.
నాలుగేళ్ల మూడు నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా పార్టీ కోసం కాపలా కాసిన ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని, టిడిపి కార్యకర్తలను వేధించిన అధికారులపై జుడిషియల్ విచారణ జరిపిస్తామని, వారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని, దానికోసమే ఈ రెడ్ బుక్ బెట్టుకున్నానని లోకేష్ స్పష్టం చేశారు.