ఐటి షోకాజ్ నోటీసులపై చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెబుతూ, అసలు విషయాన్ని దాటవేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరావతి కాంట్రాక్టులకు సంబంధించి, లంచాల రూపంలో రూ.118 కోట్లు చంద్రబాబు తీసుకున్నారని తేలిందని… వేదికలెక్కి ప్రజలకు నీతులు చెప్పే బాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుది ఒక చీకటి చరిత్ర అని, రాజకీయంగా, ఆర్థికంగా ఆయన ఎదిగిన తీరు అలాంటిదని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడిపైనా ఇన్ని స్కాంలు, ఆరోపణలు రాలేదని, ఏలేరు స్కాం మొదలు స్టాంపుల కుంభకోణం, నేటి అమరావతి వరకు చంద్రబాబు కుంభకోణాల చిట్టా చాలా పెద్దదన్నారు. “మొదట్నుంచి చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషియన్. మామని వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులే చంద్రబాబువి. దర్జాగా ఒక నాయకుడిగా చంద్రబాబు ఎదిగిన సందర్భాలు లేవు. నారావారి పల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు అవినీతి పునాదుల మీద చంద్రబాబు ఎదిగారు” అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.
బాబును స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ గా అమర్నాథ్ అభివర్ణించారు. ఎంత పెద్ద దొంగ అయినా.. ఏదో ఒక సందర్భంలో దొరక్క మానడని, ఆయన అవినీతి చరిత్ర అంతా రుజువులతో సహా నిరూపితం అయిందని, మాట్లాడితే తాను నిప్పును అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడో తుప్పు పట్టేశారని ఎద్దేవా చేశారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు కావని, ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన నిజాలని అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ పేరిట రూ.350 కోట్లు కాజేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట డబ్బులు కాజేశారని, మరోవైపు అమరావతి రాజధానిపేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని… యూరో లాటరీ తరహాలో సీమెన్స్ పేరిట మోసం చేశారని మంత్రి వెల్లడించారు.
సీమన్స్ నుంచి అమరావతి వరకు చంద్రబాబు స్కాములు వెలుగు చూశాయని, ఆయన చేసిన తప్పులు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని, చట్టం, మిగిలిన శాఖలు చేయాల్సిన పనులు చేస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు దోచేసిన సొమ్మును తీసుకురావటానికి ఈడీలాంటి సంస్థలు జోక్యం చేసుకోవాలని, దుబాయ్ లాంటి విదేశాల నుంచి డబ్బు మనీల్యాండరింగ్ జరిగింది. ఈడీ ఈ కేడీని పట్టుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.