దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ శుక్రవారం (ఆగస్ట్ 6) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్వేతా అవస్తి చెప్పిన మాటలు ఆమె మాటల్లోనే..
“మాది పూణే. నేను రీసెర్చ్ స్టూడెంట్‌ని, చదువుకునేటప్పుడు మోడలింగ్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్‌కు కమర్షియల్ యాడ్స్ చేయడానికి వస్తుండేదాన్ని. ఓ కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోను చూసి 2018లో హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చింది. అదే ‘మళ్లీ మళ్లీ చూశా’. ఈ సినిమా 2019లో విడుదలైంది. ఇప్పుడు ’మెరిసే మెరిసే’ నా రెండో సినిమా. తొలి సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ పవన్ కుమార్ నన్ను ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. కథ విన్న తర్వాత వర్క్ షాప్‌కు అటెండ్ అయ్యాన”ని తెలిపింది.
“దినేశ్ తేజ్ ‘హుషారు’, ‘ప్లేబ్యాక్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తను మంచి కో-స్టార్. నాకు భాష పరంగా డైలాగ్స్ చెప్పే సమయంలో బాగా హెల్ప్ చేశాడు. సన్నివేశం పూర్తయిన తర్వాత తర్వాతి సీన్ ఎలా చేయాలని ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్లం. సెట్‌లో అందరూ అంతే సపోర్టివ్‌గా ఉన్నారు. నటిగా విషయాలను నేర్చుకున్నాను. డైరెక్టర్ పవన్‌కుమార్ మంచి టాలెంటెడ్ పర్సన్. దర్శకుడిగా తొలి సినిమానే అయినా కూడా చాలా క్లారిటీతో సినిమాను పూర్తి చేశాడు. యాక్టర్ నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు మంచి ఐడియా ఉంది” అని అవస్తి వెల్లడించింది.
“ఉత్తరాది ప్రేక్షకుల కంటే దక్షిణాది ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ నటులను ఆరాధిస్తారు. ఉదాహరణకు రజినీకాంత్ లాంటి పెద్ద హీరో సినిమా అంటే మూడు నాలుగు గంటల ముందే క్యూలో నిలబడి టికెట్స్ కొంటారు. ఇక్కడ సినిమా అంటే ఎమోషన్, సెలబ్రేషన్. ‘మహానటి’ లో కీర్తి సురేశ్ గారు ఎంత చక్కగా చేశారు. నటిగా.. అలాంటి ఓ వైవిధ్యమైన పాత్రను చేయాలనుకుంటున్నాను. ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాను. ఇప్పటికే లడక్‌లో షూటింగ్‌ను పూర్తి చేశాం. అలాగే ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని వివరించింది.