చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆ పార్టీ అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఓ ప్రత్యేక వెబ్ సైట్ https://apskilldevelopmenttruth.com/ ను రూపొందించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలు అచ్చెన్న సమాధానమిస్తూ… దీనిపై తనను అడిగితే తానేం చెబుతానని ప్రశ్నించారు.
ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి బాబు అరెస్టును ఖండిస్తున్నారని, హైదరాబాద్ లో ఐటి ఉద్యోగులు నిన్న, మొన్న భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారని… నిన్న విజయవాడ బెంజ్ సర్కిల్ లో కూడా ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలియజేశారని, ఎప్పుడో పదేళ్ళ క్రితం రాష్ర విభజన సమయంలో ఈ స్టాయిలో ఉద్యమం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు బాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వచ్చారని, తెలుగుదేశం నేతలెవరూ దీన్ని నిర్వహించలేదని అచ్చెన్న చెప్పారు. ఎవరినీ స్పందించాలని తాము అడగడం లేదని, సంబంధం లేని విషయంలో అరెస్టు చేశారు కాబట్టి ఎవరికి వారు ముందుకు వస్తున్నారనిపేర్కొన్నారు. పొత్తుపై నిన్ననే ప్రకటన వచ్చింది కాబట్టి విధి విధానాలను త్వరలోనే రూపొందించుకుంతామని చెప్పారు.