తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజకీయంగా, వ్యక్తిగతంగా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో పలుసార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా… తొలిసారి ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. 1995లో సిఎంగా పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు మొదట యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీయే)కి బైట నుంచి మద్దతు, ఆ వెంటనే ఎన్డీయేతో కలిసి రెండు సార్లు పోటీ, 2009లో రాష్ట్ర స్థాయిలో మహా కూటమి…. ఇలా ఎన్నికలు- అవసరాలు లక్ష్యంగానే బాబు రాజకీయ ప్రస్థానం సాగింది.
మరోవైపు ‘జన్మభూమి’ కార్యక్రమం ద్వారా పరిపాలనా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఐటి రంగం అభివృద్ధికి కృషి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. 1999లోనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిపై విజన్ 2020 పేరుతో ఓ పాలసీ డాక్యుమెంట్ తయారు చేశారు. కానీ గ్రామీణ, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేసిన ఫలితం, వైఎస్సార్ పాదయాత్ర తో 2004లో అధికారం కోల్పోయారు. వైఎస్సార్ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో … టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసినా ప్రజలు 2009లో బాబును తిరస్కరించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మళ్ళీ ఎన్డీయే కూటమితో కలిసి బాబు పోటీ చేశారు. అదే ఏడాది జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ టిడిపి-బిజెపి కూటమికి భేషరతు మద్దతు ప్రకటించారు. అధికారం సంపాదించిన చంద్రబాబు గత ఐదేళ్ళ పదవీ కాలంలో తన ఒరిజినాలిటీని కోల్పోయారు. లోకేష్… పార్టీ, పాలనా వ్యవహారాల్లో జోక్యం మొదలు పెట్టడంతో బాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్ ట్రాక్ తప్పింది. వివిధ ఒత్తిడుల కారణంగా లోకేష్ ను మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు.
యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయేలకు కన్వీనర్ గా ఢిల్లీలో తాను అనుకున్నవి సాధించిన ఆయన … మోడీ, అమిత్ షాల హయంలో ఆ ‘ప్రత్యేక’ హోదా అనుభవించలేకపోయారు. విభజన హామీల అమల్లో మోడీ ప్రభుత్వ తాత్సారంతో పాటు హస్తినలో ప్రాభవం కోల్పోయిన చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. అదే సమయంలో అమిత్ షా, మోడీల ఏపీ పర్యటన సందర్భంగా టిడిపి వ్యవహరించిన తీరు, వారిపై బాబు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు బిజెపి-టిడిపిల మధ్య దూరాన్ని పెంచాయి. బాబు అంతటితో ఆగకుండా మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రయత్నాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో ఘోర పరాభవం, జాతీయ స్థాయిలో బిజెపి భారీ విజయం బాబుకు శరాఘాతంగా మారింది.
గత ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత పార్టీ కోలుకోవడానికి కనీసం పదేళ్ళ సమయం పడుతుందని అందరూ భావించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం, టిడిపి ఆఫీస్ పై దాడి లాంటి… వైఎస్సార్సీపీ వైపు నుంచి జరిగిన చిన్న చిన్న తప్పుల కారణంగా టిడిపి శ్రేణులు రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’, లోకేష్ యువగళం, భవిష్యత్తుకు గ్యారంటీ, ప్రాజెక్టుల యాత్ర లతో పార్టీ గాడిలో పడింది. ఇదే సమయంలో బాబు అరెస్టయ్యారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే పని మొదలు పెట్టారు. ప్రజావాణి, వారాహి యాత్రల ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు చీలితే అది అంతిమంగా జగన్ కు మేలు చేస్తుంది కాబట్టి కలిసి పోటీ చేయాలని బాబు-పవన్ లు మూడు నెలల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ బాబు అరెస్ట్ తదనంతర పరిణామాల్లో చంద్రబాబు మరో మెట్టు దిగి పవర్ షేరింగ్ ఫార్ములాకు కూడా సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. పొత్తులు కుదరక, మరోసారి పార్టీ ఓటమి పాలైతే అసలు పార్టీ మనుగడ.. భవిష్యత్ లో లోకేష్ నాయకత్వానికి ఇది పెను సవాలు అవుతుంది కాబట్టి ఎలాగైనా జగన్ ఓటమే లక్ష్యంగా ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని, దానికి అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమనే సంకేతాలు బాబు ఇస్తున్నారని సమాచారం.
గత నెల వరకూ జనసేనకు 25 సీట్లు ఆఫర్ చేశారంటూ ప్రచారం జరగగా ఇప్పుడు మొన్న రాజమండ్రి జైల్లో ములాఖత్ లో ఆ సంఖ్య 50 వరకూ చేరుకుందని, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు జనసేనకే కేటాయించేలా ఒప్పందం కుదిరిందని టాక్ వినిపిస్తోంది. బిజెపి-జనసేన కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కు మొదటి రెండేళ్లపాటు సిఎం పదవి కూడా ఇచ్చేందుకు బాబు అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే బాబు రాజకీయాలు తెలిసిన వారు మాత్రం ఈ ప్రతిపాదన జరిగే వ్యవహారం కాదని కొట్టిపారేస్తున్నారు.
రాజకీయంగా తన అవసరాల కోసం ఎప్పుడు ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడని చంద్రబాబు, నేడు అనివార్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు తలొగ్గాల్సిన అంగీకరించాల్సి వస్తోంది. ఇది ఆయన స్వయంకృతాపరాధమే.