Saturday, July 27, 2024
HomeTrending NewsUS Coconuts: కొబ్బరి కాయల సుబ్బారాయుడు... వివేక్ రామస్వామి

US Coconuts: కొబ్బరి కాయల సుబ్బారాయుడు… వివేక్ రామస్వామి

వివేక్ రామస్వామి !
2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి .
ఇప్పుడున్న హెచ్చ్ -వన్- బి వీసా విధానం ” ఒప్పంద బానిసత్వమని”… తాను అమెరికా అధ్యక్షుడు అయితే, దీని స్థానంలో ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని ప్రవేశ పెడతానని చెప్పారు.

Y2K సమస్య కు ముందు అమెరికాకు వెళ్లి ఉద్యోగం సాధించి, అక్కడ స్థిరపడడం చాలా కిష్టంగా ఉండేది. అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారికే అది సాధ్యమయ్యేది.

2000 సంవత్సరం… ఆ మాటకొస్తే దానికి రెండు -మూడేళ్ళ ముందు నుంచే వై 2 కే సమస్య నేపధ్యంలో, అమెరికాలో ఉద్యోగం సాధించడం సులభం అయిపొయింది . దీనితో పెద్ద ఎత్తున మన వారు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు .

గత మూడు నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ, మరీ ఫ్రాడ్ గా మారి, ఆంగ్లం మాట్లాడలేనివారు, కనీస స్థాయి ప్రతిభ లేనివారు, అడ్డదారుల్లో అక్కడికి వెళ్లిపోతున్నారు . { వెళ్లిన వారందరూ అడ్డదారిలో అని చెప్పడం లేదు }

ఈ నేపధ్యం లో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో భారతీయులపై జాతి విద్వేషం పెరిగిపోతోంది. అక్కడి స్థానికులు… భారతీయుల వల్లే తమకు ఉద్యోగ వకాశాలు లేకుండా పోతున్నాయని భావించే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు గత కొంత కాలంగా వలస వెళుతున్న మనవారు అక్కడి పద్ధతులను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది కూడా భారతీయుల పట్ల అక్కడివారిలో వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేస్తోంది.

2000 కు ముందు అమెరికా వలస వెళ్ళినవారు .. అంటే ఇప్పుడు యాభై , అరవైల్లో ఉన్నారు. వీరికి అమెరికా పౌరసత్వం వచ్చి ఉంటుంది. లేదా కనీసం గ్రీన్ కార్డు. వీరి పిల్లలు అక్కడే పుట్టారు. అంటే జన్మతః వారికి అమెరికా పౌరసత్వం వచ్చింది.

వీరిలో అందరూ అనలేము కానీ… చెప్పుకోదగ్గ శాతం… ముఖ్యంగా అక్కడే పుట్టిన వీరి పిల్లలు తమని తాము కొబ్బరి కాయగా భావిస్తున్నారు.
కొబ్బరి కాయ.
పైన  గోధుమ(బ్రౌన్) గా ఉంటుంది. లోన తెలుపు.
తాము కూడా చర్మం రంగు విషయంలో మాత్రమే బ్రౌన్ గా అంటే భారతీయులుగా కనిపిస్తున్నామని… నిజానికి తాము అసలు సిసలు తెల్ల జాతివారం… అంటే ఆలోచనలు , పద్ధతుల్లో శ్వేతజాతి అని వీరు భావిస్తున్నారు.

అమెరికా యూనివర్సిటీలలో ఈ ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లిన భారతీయ విద్యార్థులు, అక్కడే పుట్టిన భారత సంతతి వారిని చూసి మురిపెంగా పలకరిస్తే వారికి హేళన ఎదురవుతోంది.
” మేము ఆలోచనల్లో అమెరికన్లు … … కేవలం స్కిన్ కలర్ మీలా ఉంటే… మేము, మీరు ఒకటే అనుకొంటే ఎలా ? అసలు మీ పేస్ లు అద్దంలో ఒకసారి చూసుకోండి. మీరు ఎర్రబస్సు ఎక్కివచ్చిన వారిలాగా ఉన్నారు. ఆంగ్లం మాట్లాడడం రాదు ” అంటూ వీరి యాసను వెక్కిరిసూ మైక్రో అగ్రేషన్ కు గురి చేస్తున్నారు.  అంటే చట్టానికి దొరక్కుండా వీరిని టీజ్ చేయడం. తమని తాము కోకోనట్ అని పిలిచుకొనే రెండో తరం భారత సంతతి వారు ఇప్పుడే అక్కడికి వెళ్లిన వారిని ఫాబ్ అంటే ఫ్రెష్ ఆఫ్ ది బోట్ అని పీలుస్తున్నారు.

{ దీన్ని అర్థం ఫాబ్ లందరూ అమాయకులు కొబ్బరి వారు బ్యాడ్ అని కాదు. ఫాబ్ లలో కొందరు దేశ ముదుర్లు. కొబ్బరి అమ్మాయిని సైట్ కొడితే ఏకంగా అమెరికా అల్లుడు అయిపోయి డైరెక్ట్ గా అమెరికా పౌరసత్వం, మంచి ఆస్థి కొట్టేయచ్చు అని… వెకిలిగా… మహా వెకిలిగా ప్రవర్తించే ఇడియట్ టైపు వారు కోకొల్లలు. అక్కడే పుట్టిన అమ్మాయిలకు ఇలాంటివి నచ్చవు. వాళ్ళేమైనా సినిమా హీరోయిన్ లా? పోకిరీల్ని ఇడియట్ లను చూసి పడిపోవడానికి ?. తరాల అంతరం మాస్టారు ! }

దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?

వేల్యూ జడ్జ్మెంట్ అవుతుంది.
రెండు భిన్నాభిప్రాయాలు.

ఇప్పుడు వలస వచ్చేవారు మరీ వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. వీరి వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకొనే పరిస్థితి.

మరో కోణం లో చూస్తే జనరల్ రైల్ బోగీలో ఎక్కేవారు .. తాను ఎక్కి సీట్ దక్కించుకొనేదాకా ఒకలా ఆలోచిస్తారు. ఒకసారి సీట్ దక్కగానే ఇక ఎవరూ ఎక్కకూడదని, ఎక్కేవారిని నెగటివ్ గా చూస్తారు. భోగీ ఎక్కనివ్వరు. వీలైతే తోసేస్తారు.

ఇలా కొంత .. ఆలా కొంత అనుకోండి.

మొత్తానికి భారతీయులు విచ్చల విడిగా రావడం ఆగిపోవాలని నేడు కోరుకొంటున్న వారిలో అమెరికన్ ల కన్నా, మన కొబ్బరి కాయవారే ఎక్కువ.

American Presidential Race

కొబ్బరి కాయల సుబ్బారాయుడు !
వివేక్ రామస్వామి !!
వయసు 37 ఏళ్ళు. తల్లితండ్రులు కేరళ నుండి అమెరికాకు వలస పోయారు. ఈయన అక్కడే పుట్టిన రెండో తరం భారత జాతి వాడు.

ఇప్పుడేమో అమెరికా కంపెనీలకు ఉద్యోగులను తెచ్చుకొనే అవకాశముంటోంది. ఈ వీసా విధానం స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తానని రామస్వామి చెబుతున్నాడు. ఇతనికి అక్కడ ఉన్న కొబ్బరి జాతి ఓట్లు ఖాయం. ఎలాగూ శ్వేత జాతి ఓట్లు కూడా వస్తాయి. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు.
వెరసి… కలిసి … గెలవడం సులభం.

గెలిస్తే ముందుగా కొబ్బరి వారి ఎజెండా.
అంటే ఇప్పటిలా ఇబ్బుడిముబ్బుడిగా వెళ్లడం సాధ్యపడదు. ముఖ్యంగా డిపెండెంట్స్ వెళ్లడం సాధ్యపడదు.

అంటే ఇక్కడినుంచి వెళ్లినవారే.. ఇక్కడినుంచి వెళ్ళడానికి మార్గాన్ని కష్టతరం చేసేయ పోతున్నారు.

సమస్య ముదిరితే ఆ సమస్య నుంచే సమాధానం వస్తుంది. ఒక వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాలే ఆ వ్యవస్థ మారడానికి కారణం అవుతాయి.

బ్రిటిష్ వలస సామ్రాజ్యం కూలింది .. మహామహా నియంతలు మట్టి కరిచింది ఇలాగే!

ఇదే మానవజాతి చరిత్ర !

ఎప్పుడో కారల్ మార్క్స్ చెప్పిన గతితార్కిక భౌతిక వాదం .. అమెరికా భారతీయుల విషయంలో నిజం కాబోతుందా ?

మార్క్స్ చెప్పిందేమిటో అర్థం కాలేదా ? దాన్నే మన పూర్వీకులు” పెరుగుట విరుగుట కొరకే “అన్నారు.

-వాసిరెడ్డి అమర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్