జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న నాలుగో విడత యాత్రలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నేడు నంద్యాలలో జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జన సేన-టిడిపిల నుంచి ఐదుగురు చొప్పున పది మందితో సమన్వయ కమిటీని నియమించనున్నారు. బాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను తొలుత ఫోన్ లో పరామర్శించి బాబు విడుదలైన తర్వాత వారిని వ్యక్తిగతంగా కలవనున్నారు.
ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 97మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిసిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎల్లుండి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఒకరోజు పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకూ రెండు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తున్నారని, దీనికి కొనసాగింపుగా రాష్ట్ర స్థాయిలో కూడా రెండు పార్టీలకూ చెందిన పదిమందితో కమిటీ ఏర్పాటు చేస్తామని అచ్చెన్న చెప్పారు.